సినిమాను వ్యాపార దృష్టి తో తాను ఎన్నడూ చూడనని అంటోంది అనుష్క. ఆన్‌స్క్రీన్ మ్యాజిక్‌ను.. సంతోషాన్ని ప్రతిక్షణం ఆస్వాదించడానికే ప్రయత్నిస్తానని అంటోంది. ‘సూపర్’సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసిన అనుష్క చిత్రసీమలో అడుగుపెట్టి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ప్లాన్ చేస్తూ తానెప్పుడూ సినిమాలు చేయలేదని తెలిపింది. మనసు చెప్పిన మాటలకు కట్టుబడుతూ ముందుకుసాగానని తెలిపింది. ‘వ్యాపార కోణంలో ఆలోచించి ఇప్పటివరకు సినిమాల్ని అంగీకరించలేదు. ఆ లెక్కలు నాకు తెలియవు. నా కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుంది? పేరు తీసుకొస్తుంది? అనేవి పట్టించుకోను. నా మనసుకు నచ్చితే చాలనుకుంటాను. అంతకుమించి ఏదీ కోరుకోను. ఎలాంటి ప్రణాళికలు వేసుకోకుండా సినిమాల్లో నటిస్తుంటా. ఆ ఆలోచనా విధానమే నాకు విజయాల్ని తెచ్చిపెట్టింది. డబ్బు, స్టార్డమ్ ఇవ్వలేని సంతృప్తి, ఆనందాన్ని ఈ సక్సెస్‌లతో పొందగలిగా’ అని అనుష్క తెలిపింది.
తప్పకుండా పెళ్లి చేసుకుంటా!… పెళ్లి చేసుకునే వరకు తాను సినిమాలపైనే ఫోకస్ పెడతానని ప్రముఖ నటి అనుష్క తెలిపింది.అంచలంచెలుగా ఎదిగిన అనుష్క ఆ తర్వాత అగ్ర నటి అయ్యింది.. ‘బాహుబలి’ లో దేవసేనగా నటించి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. అయితే అనుష్క పెళ్లిపై చాలా కాలంగా అనేక పుకార్లు వస్తున్నాయి. కానీ అనుష్క మాత్రం స్పందించలేదు. వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని.. మనసుకు నచ్చినవాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పిల్లలు కూడా కావాలనుకుంటున్నానని.. అయితే పిల్లల విషయంలో తొందరేమీ లేదని ఆమె తేల్చి చెప్పింది. తనకు 20 ఏళ్లు ఉన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తడి తెచ్చారని.. అయితే ఇప్పడు వారి ఆలోచన ధోరణి మారిందని ఆమె పేర్కొంది. పెళ్లి చేసుకునే వరకు తాను సినిమాల్లో నటిస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేసింది.
యోగా టీచర్‌గా మీరు నేర్చుకున్నది?
మనలో ప్రతి ఒక్కరూ భిన్నమైన వాళ్లమే. మనల్ని మనం కోల్పోకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి, గౌరవించాలి. నిరంతరం స్వీయ విమర్శ చేసుకుంటూ ఉండాలి.
లాక్డౌన్లో మీరు నేర్చుకున్న విషయం?
మన జీవితం, మన చుట్టూ ఉన్నవన్నీ ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుందాం.
మీకు స్ఫూర్తిగా నిలిచినవాళ్ళు ఎవరు ?
మా అమ్మానాన్న, యోగా గురువు, అలానే నేను ప్రతి రోజూ కలిసేవాళ్లు. అందరూ నాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నారు.