అనుష్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా ఆమె తొలి రోజులని గుర్తు చేసుకుంటూ ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది… “నాకు నేనుగా సినిమాల్లోకి రాలేదు. అలా జరిగిపోయింది. పూరీ జగన్నాథ్ గారు ‘సూపర్’ సినిమాలో హీరోయిన్ కోసం చూస్తుంటే ఆయనకి తెలిసిన ఫ్రెండ్ నా గురించి చెప్పారు. అప్పుడు పూరీ సర్ ‘ఓకే’ అనడంతో హైదరాబాద్కి వచ్చాను. అలా తొలి అవకాశం నాకు వచ్చింద”ని అనుష్క అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె కెమెరాని ఫేస్ చేసి నిన్నటితో 14 సంవత్సరాలు కావడంతో ఆ ఇంటర్వ్యూ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. కెమెరా ముందుకు వచ్చి 14 ఏళ్ళు అవుతుంది. నా కోసం ప్రత్యేక సమయం కేటాయించి నన్ను ఈ స్థానంలో నిలిపిన వారికి, నాగార్జున గారికి, పూరీ జగన్నాథ్ గారికి మరియు నా అభిమానులు, నా కుటుంబం, స్నేహితులు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొంది అనుష్క. 2005లో వచ్చిన ‘సూపర్’ చిత్రంతో అనుష్క తెలుగు తెరకి పరిచయం అయిన సంగతి తెలిసిందే.
గ్లామర్ పాత్రల్లో.. ధీరత్వం ప్రదర్శించే పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది అనుష్క. ‘బాహుబలి’ చిత్రం తర్వాత ఇండియాలోనే కథానాయికగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుందని అంతా భావించారు. అయితే అనుష్క ‘సైజ్ జీరో’ సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం లావు కావడం ఆమెకు మైనస్గా మారింది. దీంతో దాదాపు సంవత్సరం పాటు ఈ బ్యూటీ కెమెరాకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈమధ్య కాస్త సన్నబడ్డ అనుష్క మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో ఆమెకు అన్నీ లేడీ ఓరియెంటెడ్ పాత్రలే దక్కుతున్నాయి. తెలుగులో ఇప్పటికే ఆమె ఒక చిత్రానికి కమిట్ అయింది. ఆ సినిమాలో కీలక పాత్రలో మాధవన్ నటించబోతున్నాడు. ఈ సినిమాతో పాటు స్వామి అయ్యప్ప కథాంశంతో తెరకెక్కబోతున్న చిత్రంలో నటించేందుకు కూడా అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడం భాషలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. సంతోష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట. గతంలో అనుష్క ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో కృష్ణమ్మ అనే పాత్రలో నటించింది. అలాంటి పాత్రనే అయ్యప్ప సినిమాలో కూడా ఆమె చేయబోతున్నట్లుగా తెలిసింది.