బిల్డప్ ఎక్కువ..బిజినెస్ తక్కువ…’భాగమతి’ చిత్ర సమీక్ష

                                           సినీవినోదం రేటింగ్ : 2.5/5
యు.వి.క్రియేష‌న్స్‌ బ్యానర్ పై  జి.అశోక్‌ దర్శకత్వం లో వంశీ, ప్ర‌మోద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు
 
భారీ నీటి పారుద‌ల శాఖా మంత్రి ఈశ్వ‌ర్ ఫ్ర‌సాద్ (జ‌య‌రాం)కు ప్ర‌జ‌ల్లో మంచి పేరు, ప‌లుకుబ‌డి ఉంటుంది. ఈశ్వ‌ర్ ప్ర‌సాద్‌కు భ‌క్తి ఎక్కువ‌. ఆయ‌న ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తుంటాడు. అదే స‌మ‌యంలో ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లోని పురాత‌న విగ్ర‌హాల‌ను ఎవ‌రో చోరీ చేస్తుంటారు. దాంతో ప్ర‌భుత్వం విగ్ర‌హాల చోరీని అరిక‌ట్టేందుకు వైష్ణ‌వి న‌ట‌రాజ‌న్(అశా శ‌ర‌త్‌) నేతృత్వంలో ఓ సీబీఐ క‌మీష‌న్‌ను నియ‌మిస్తారు. అశా ప‌రిశోధ‌న‌లో ఈశ్వ‌ర్ ప్ర‌సాద్ అల‌యాల సంద‌ర్శ‌న‌లో ఉన్న స‌మ‌యంలోనే విగ్ర‌హాలు చోరీ అవుతున్న సంగ‌తుల‌ను గుర్తిస్తుంది. అయితే ఈశ్వ‌ర్ ప్ర‌సాద్‌ను అరెస్ట్ చేయాలంటే అత‌ని లొసుగుల‌ను తెలుసుకోవాల‌ని.. ఆయ‌న ద‌గ్గ‌ర ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌గా ప‌నిచేసిన చంచ‌ల‌(అనుష్క‌) విచారించాల‌నుకుంటుంది. చంచ‌ల ఐఏయ‌స్ ఆఫీస‌ర్‌. అయితే అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ సంప‌త్‌(ముర‌ళీశ‌ర్మ‌) సోద‌రుడు, త‌న‌కు కాబోయే భ‌ర్త శ‌క్తి(ఉన్ని ముకుంద‌న్‌)ను హ‌త్య చేసిన నేరంలో జైలు శిక్ష అనుభ‌విస్తుంటుంది. ఆమెను ఎవ‌రికీ తెలియ‌కుండా విచారించాల‌నుకున్న వైష్ణ‌వి… సంప‌త్ స‌హాయంతో ఊరికి దూరంగా ఉన్న భాగ‌మ‌తి బంగ‌ళాకు తీసుకొస్తుంది. ఆ బంగ‌ళాలో చంచ‌ల‌ను బంధించి, బ‌య‌ట సెక్యూరిటీని పెడుతుంది. భాగ‌మ‌తి బంగళా అంటే ఆ చుట్టుప‌క్క‌ల ఉండేవారికి భ‌యం. రాణీ భాగ‌మ‌తి దేవి దెయ్య‌మై తిరుగుతుంద‌ని అంద‌రూ న‌మ్ముతుంటారు. లోప‌లికి వెళ్లిన చంచ‌ల‌కు అనుకోని ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో భ‌యానికి లోన‌వుతుంది. లోప‌ల దెయ్యం ఉంద‌ని చంచ‌ల చెప్పినా ఎవ‌రూ న‌మ్మ‌రు. నిజంగానే బంగ‌ళాలో దెయ్యం ఉందా? చంచ‌ల‌ను భ‌య‌పెట్టి, చిత్ర హింస‌ల‌కు గురి చేసేదెవ‌రు? అస‌లు ఈశ్వ‌ర్ ప్ర‌సాద్‌, చంచల‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? అనే విష‌యాలు సినిమాలో చూడాలి……
 
ద‌ర్శ‌కుడు అశోక్ ఓ సామాజిక అంశానికి హార‌ర్ ఎలిమెంట్‌ని జోడించి సినిమాను తెర‌కెక్కించాడు. ఇలాంటి పాయింట్‌ను ప్రేక్ష‌కులు చాలా సినిమాల్లో చూసేశారు. కాబ‌ట్టి క‌థ‌లో కొత్త‌దనం క‌న‌ప‌డ‌దు.సినిమాకు ప్రధాన మైనస్ హర్రర్ సన్నివేశాలు మినహా కథకు ప్రధాన బలంగా నిలిచే కీలకమైన సన్నివేశాల్లో తీవ్రత లోపించడం. చాలా సీన్లు ఏదో నడుస్తున్నట్టే ఉంటాయి తప్ప పెద్దగా ఎగ్జైట్మెంట్ కలిగించవు. గ‌తంలోవచ్చిన ‘పిజ్జా’ చిత్రం త‌ర‌హాలోనే ‘భాగ‌మ‌తి’ క‌థ‌నం సాగుతుంది. ప్రథమ, ద్వితీయార్థాలలో ప్రస్తుతంతో పాటు నడిచే అనుష్క గతాన్ని చాలా పేలవంగా ప్రెజెంట్ చేశారు.ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్ పార్ట్‌ లు పార్ట్‌ లుగా రావటం. కొన్ని జరగని సంఘటనలు జరిగినట్టుగా భ్రమ కలిగించటంతో ఆడియన్స్‌ కాస్త తికమక పడే అవకాశం ఉంది. దీంతో కీలక మలుపుల్లో పట్టు లోపించి ప్రేక్షకుడు నిరుత్సాహానికి గురికావాల్సి వచ్చింది.
 
ఇక సినిమా క్లైమాక్స్ కొంత ఊహించనిదీ, కొత్తదే అయినప్పటికీ ఎఫెక్టివ్ గా లేకపోవడంతో ప్రేక్షకుడు పెద్ద ఎగ్జైట్మెంట్ ఫీలవకపోగా అసంతృప్తి చెందుతాడు. ప్రేక్షకుడు సినిమాకు ఒక కథను ఊహించి వచ్చినప్పుడు… దర్శకుడు అసలు కథ వేరే ఉందనే ట్విస్ట్ ఇవ్వదల్చుకుంటే …ఆ కథ ఎంతో బలంగాను, ప్రేక్షకుడు ఊహించుకున్నదానికంటే బలంగా ఉండాలి. కానీ ఇందులో కథ చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో నిరుత్సాహం తప్పలేదు.
 
సినిమాకు ప్రధాన ఆధారంగా నిలిచిన అనుష్క తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, నటనతో ఆద్యంతం మెప్పించింది. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో తన హావభావాలతో ప్రేక్షకులను థ్రిల్  చేసి భాగమతిగా ఆకట్టుకుంది. ఒక‌వైపు ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా, మ‌రో ప‌క్క భాగ‌మ‌తిగా రెండు షేడ్స్‌లో అనుష్క న‌ట‌న సింప్లీ సూప‌ర్బ్‌. గ‌తంలో అనుష్క ఇలాంటి పాత్ర‌లు చేసి ఉండ‌టం వ‌ల్ల భాగ‌మ‌తి పాత్ర‌ను అనుష్క సునాయ‌సంగా చేసేసింది. అయితే ప్ర‌మోష‌న్‌లో ఇచ్చిన బిల్డ‌ప్ రెండు మూడు స‌న్నివేశాల‌కే ప‌రిమిత‌మైపోవ‌డంతో ప్రేక్ష‌కుడు నిరాశ‌కు లోన‌వుతాడు. ఇక సినిమాలో మ‌రో ప్ర‌ధాన‌మైన పాత్రచేసిన మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రాం  హండ్రెడ్ ప‌ర్సెంట్ న్యాయం చేశారు. అయితే ఎప్ప‌టిలాగానే బ్యాడ్ పొలిటీషియ‌న్ ముందు మంచిగా ఉండ‌టం అనే పాయింట్‌ను ప్రేక్ష‌కుడు ముందుగానే ఊహించేస్తాడు. ఇక అనుష్క జోడిగా న‌టించిన ఉన్ని ముకుంద‌న్ పాత్ర ప‌రిమితం అయినా న్యాయం చేసాడు. ఇక సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ముర‌ళీశ‌ర్మ‌, సీబీఐ ఎంక్వైరీ క‌మీష‌న‌ర్‌గా ఆశా శ‌రత్ మెప్పించారు. ఇక ధ‌న‌రాజ్‌, విద్యుల్లేఖా రామ‌న్‌, ప్ర‌భాస్ శ్రీనులు ఉన్నంతో కామెడీని పండించే ప్ర‌య‌త్నం చేశారు కానీ, అంతగా వ‌ర్కవుట్ కాలేదు.
 
‘భాగమతి’ చిత్రంలోని గొప్పతనమంతా సాంకేతిక నిపుణుల ప్రతిభకే చెందుతుంది.త‌మ‌న్ నేప‌థ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం గా నిల‌బ‌డింది. మ‌ది సినిమాటోగ్ర‌ఫీ కూడా చాలా బావుంది. ర‌వీంద‌ర్ ఆర్ట్ వ‌ర్క్ హైలైట్ అయ్యింది. సినిమాకు డార్క్, హర్రర్ లుక్ ను అందించి అనుక్షణం ప్రేక్షకుడు ఉత్కంఠకు గురయ్యేలా చేశారు.అయితే సినిమా అంతటా క‌థ కంటే ఈ ఆర్ట్ వ‌ర్క్‌ను తెర‌పై చూపించాల‌నే త‌పనే ఎక్కువ‌గా క‌న‌ప‌డింది. సంభాష‌ణ‌ల్లో ప‌దును లేదు. హార‌ర్ ఎంట‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను ఇష్ట‌ప‌డుతున్న తెలుగు ప్రేక్ష‌కులకు భాగ‌మ‌తి నిరాశ‌నే క‌లిగిస్తుంది. అయితే అనుష్క‌ను ఇష్ట‌ప‌డేవారికి కాస్త పర్వాలేదనిపించొచ్చు  – ధరణి