అనుపమ పరమేశ్వరన్… “మొదట సహాయ దర్శకురాలిగా చేసి ఆతర్వాత దర్శకురాలిని అవుతాను” అని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్. హీరోలు, హీరోయిన్లు, నటులు దర్శకులుగా మారడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే వీరిలో కొందరు సక్సెస్ కాగా కొందరు మాత్రం నిరాశచెందారు. అయితే ఎంతో మందికి డైరెక్షన్ చేయాలని కోరిక ఉన్నప్పటికీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకులుగా మారుతున్నారు. అయితే నవ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు కూడా దర్శకురాలిగా మారాలనే కోరిక ఉందట. ‘ప్రేమమ్’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె తెలుగులో ఈమధ్య వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. “మణిరత్నం దర్శకత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. దర్శకురాలిగా మారి ఆయనలా కనీసం ఒక్క సీన్ అయినా తీయాలనేది నా కోరిక. నేను ఇప్పటివరకు నటించిన సినిమాల దర్శకులు అందరితో కూడా సహాయ దర్శకురాలిగా అవకాశం ఇవ్వాలని కోరాను. త్రివిక్రమ్‌తో పాటు అందరూ కూడా తప్పకుండా ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. మొదట సహాయ దర్శకురాలిగా చేసి ఆతర్వాత దర్శకురాలిని అవుతాను” అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్.
ఏదోటి నేర్చుకునే అవకాశాన్నిస్తుంది !
గెలుపు కచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ, ఓటమి మాత్రం కచ్చితంగా ఏదోటి నేర్చుకునే అవకాశాన్నిస్తుంది అంటున్నారు అనుపమా పరమేశ్వరన్. ఇండస్ట్రీలో గెలుపోటములంటే హిట్స్, ఫ్లాపులే. వీటిని అనుపమా ఎలా తీసుకుంటారో మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఫ్లాప్స్ అనేవి సహజం. ప్రతి సినిమా బాగా ఆడుతుంది అని కూడా అనుకోలేం. ఎవరైనా సరే విజయం సాధించాలనే కష్టపడతాం. ముఖ్యంగా ఆర్ట్ విషయంలో ఏ ఒక్కరూ సులువుగా తమ పని వల్ల సంతృప్తి చెందరు.ఇంకా ఇంకా బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయపడతారు. ఫెయిల్యూర్ వచ్చిందని ఎవర్నీ నిందించలేం. కానీ, మనం ఎక్కడ తప్పు చేశాం అనే విషయాలు మళ్లీ పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఇంకా జాగ్రత్తలు తీసుకొని మనల్ని మనం మెరుగుపరుచుకునే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఓటములే మంచి పాఠాలు’’ అని అనుపమా పేర్కొన్నారు. తాజాగా రామ్‌తో ఆమె ‘హలో గురు ప్రేమకోసమే’(తెలుగు), శివరాజ్‌కుమార్‌తో నటించిన ‘నట సార్వభౌమ’ (కన్నడ) సినిమాలు చేసింది.