చేసిన పాత్రనే మళ్లీ చెయ్యడానికి కొందరు ఇష్టపడరు. కానీ నాకెందుకో తెలుగులో ‘ప్రేమమ్’ చెయ్యడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. నా పాత్రలో ఎలాంటి మార్పులేదు కానీ కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. మొదటి సినిమా కాబట్టి మలయాళ ‘ప్రేమమ్’ ఎప్పుడూ స్పెషలే నాకు…. అంటూ చెబుతోంది తక్కువ సమయం లో పాపులర్ హీరోయిన్ అయిన మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్ .
ఆ తర్వాత ‘శతమానం భవతి’లో చేసిన నిత్యా పాత్ర కూడా ప్రత్యేకమే. రానున్న ‘ఉన్నది ఒకటే జిందగీ’లో ‘మహా’ క్యారెక్టర్ నా కెరీర్లో మరచిపోలేనిది. ఆ పాత్ర చెయ్యడానికి నాకు బాగా టైమ్ పట్టింది. ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేశా. యాక్టర్‌గా నాలో చాలా మార్పు తీసుకొచ్చిన పాత్ర అది. ఇంతకు ముందు సినిమాలు ఒక ఎత్తు అయితే … ఈ సినిమా ఒక ఎత్తు. అదంతా కిశోర్ తిరుమల వల్లే. ఇప్పుడు నానితో చేస్తున్న ‘కృష్ణార్జున యుద్ధం’ కూడా స్పెషల్ సినిమా అవుతుంది. అందులో నా పాత్ర ఎలా ఉండబోతుందనేది సస్పెన్స్.
రామ్‌చరణ్‌తో ఓ సినిమా అవకాశం వచ్చింది. స్క్రిప్ట్ కూడా విన్నా. ఇక సైన్ చెయ్యడం ఒకటే ఆలస్యం. తీరా నన్ను వద్దనుకున్నారు. అందుకు కారణం ఏంటో కూడా తెలీదు. తెలుసుకోవాలనీ అనుకోవడం లేదు. రెమ్యూనరేషన్ సమస్య మాత్రం లేదు.
దర్శకుల్లో రాజమౌళి గారితో ఒక్క సినిమా అయినా చెయ్యాలనుంది. ఒక్క నిమిషం సీన్ దొరికినా చిరంజీవిగారి సినిమాలో యాక్ట్ చెయ్యాలనుంది. ఆయన 150 సినిమాలు చేసి ఇంకా కంటిన్యూ కావడమంటే మామూలు విషయం కాదు. ‘ఖైదీ నంబర్ 150’ చూశా. అబ్బబ్బా… ఆయన డాన్స్ ఎనర్జీ చూసి అదిరిపోయాను! అందుకే ఆయన సినిమాలో ఎనీ క్యారెక్టర్ చెయ్యడానికి రెడీ.
జీవితంలో పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. అవన్నీ కూడా మంచి అనుభవమే అనుకోవాలి. కానీ.. దేన్నీ ఇబ్బందిగా భావించకూడదు. ఈ మూడేళ్లలో సినిమాల్లోకి ఎందుకు వచ్చానా? అన్న భావన నాకు ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఎక్కువ. నాలో ఓర్పు ఎక్కువ. కష్టపడే తత్వం కూడా ఉంది. ఇవన్నీ సినిమాకు తప్పనిసరిగా కావాలి. కాబట్టి నేను చెయ్యగలననే నమ్మకం ఉంది. ఒకవేళ సినిమాల్లోకి రాకపోతే ‘మీడియా రిలేటెడ్ వర్క్ చెయ్యాలి’ అనే నా డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకునేదాన్ని.