‘సంప్రదాయం, ఆధునికతకు మధ్య వికసించిన పుష్పం డా.సి.నారాయణరెడ్డి’ అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి కొనియాడారు. ‘యువకళావాహిని’ ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య రచించిన ‘సినారె వైభవము’, ‘ప్రవర నిర్వేదము’ కావ్యాల ఆవిష్కరణ సభ నవంబర్ 26 న రవీంద్రభారతిలో నిర్వహించారు. గేయకావ్యం ‘సినారె వైభవము’ ‘తెలంగాణ సాహిత్య అకాడెమీ’ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. సిధారెడ్డి మాట్లాడుతూ..‘సినారె వైభవము’ తెలుగు కవిత్వ ప్రపంచంలో భూమయ్య చేసిన కొత్త ప్రయోగంగా అభివర్ణించారు.
‘ప్రవర నిర్వేదము’ ఆవిష్కరించిన డా.పాలకుర్తి మధుసూదన్‌రావు మాట్లాడుతూ… ‘తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు సినారె సజీవంగా ఉంటార’న్నారు. ‘తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు’ మామిడి హరికృష్ణ, కవి డా.తిరుమల శ్రీనివాసాచార్య, రచయిత్రి డా.కె.బి.లక్ష్మీ, తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య, ‘యువకళావాహిని’ అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.సభకుముందుగా దివాకర్ల సురేఖామూర్తి,డా.వి.వి.రామారావు గార్ల సినారె సినీగీతలహరి కార్యక్రమం రసజ్ఞులనలరించింది.