హాలీవుడ్ పై బాలీవుడ్ బిగ్ బి సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ వల్ల ఇప్పుడు ప్రాంతీయ చిత్ర పరిశ్రమలు కోలుకోలేకుండా తయారవుతున్నాయని, ప్రపంచంలో ప్రతి చోటా ఈ హాలీవుడ్ సినిమాలు విడుదలై స్థానిక సినిమా పరిశ్రమలను దోచుకుంటున్నాయని బిగ్ బి ఆవేదన వ్యక్తం చేశారు. హాలీవుడ్ చిత్రాలను ఎంత ఎక్కువగా ప్రోత్సహిస్తే అంత వినాశనం తప్పదని ఆయన తెలిపారు. హాలీవుడ్ హవా ఇప్పుడిప్పుడే భారతదేశంలోనూ వ్యాప్తి చెందుతుందని, దీనిపై ఏదో ఒకటి చేయకపోతే స్థానిక సినీ పరిశ్రమలు నిలబడటం కష్టమవుతుందని ఆయన తెలిపారు. వెంటనే హాలీవుడ్ చిత్రాలపై పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
సాంకేతికంగా హాలీవుడ్‌కి తిరుగులేదు కానీ.. ఇప్పుడిప్పుడే మన యువ దర్శకులు, నిర్మాతలు హాలీవుడ్ కంటే గొప్ప స్థాయిలో సినిమాలు తీస్తున్నారని బిగ్ బి తెలిపారు. అందుకే వెంటనే స్థానిక సినీ పరిశ్రమలు దీనిపై పోరాటానికి సిధ్దం కావాలని.. ‘102 నాటౌట్’ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న అమితాబ్ అన్నారు.
క్లాసికల్ రీమిక్స్ సాంగ్ పాడారు…
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన నటుడిగానే కాదు పలు సందర్భాలలో సింగర్‌గాను అలరిస్తుంటారు. ఇటీవల ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో ‘102 నాటౌట్’ అనే చిత్రం చేశారు అమితాబ్. ఇందులో రిషి కపూర్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. చిత్రంలో 102 ఏళ్ల కురువృద్ధుడిగా అమితాబ్, 75 ఏళ్ల వయసున్న కొడుకుగా రిషి కపూర్ నటిస్తున్నారు. గుజరాతీ రచయిత సౌమ్యజోషి రాసిన నాటకం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. మే 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, మేకర్స్‌తో పాటు అమితాబ్, రిషి కూడా ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే తాజాగా చిత్రానికి సంబంధించి ‘వక్త్ నే కియా’ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకి అమితాబ్ తన వాయిస్ అందించారు. ఎస్.డి. బర్మన్ సంగీతంలో రూపొందిన ఈ క్లాసికల్ రీమిక్స్ సాంగ్ అందరిని అలరిస్తుంది . .’102 నాటౌట్’ చిత్రంలో ‘బడుంబ’ అనే ఎనర్జిటిక్ సాంగ్‌ని కూడా అమితాబ్ ఆలపించడం విశేషం.