బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ సినిమాలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘దంగల్’కు అనూహ్య విజయాన్ని అందించిన చైనా ఆడియన్స్ తాజాగా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ను అదేస్థాయిలో ఆదరిస్తున్నారు. జనవరి 19న చైనాలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. వారం రోజుల్లోనే రూ. 264.61 కోట్ల భారీ వసూళ్లు సాధించింది.
‘దంగల్’ సినిమాను మించి ‘సీక్రెట్ సూపర్ స్టార్’ తొలిరోజు రికార్డు వసూళ్లు రాబట్టడం విశేషం. తొలిరోజే ఈ సినిమా భారీస్థాయిలో 6.79 మిలియన్ డాలర్లు (రూ. 43.35 కోట్లు) రాబట్టింది. భారత్‌లో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రానికి చైనాలో భారీ ఓపెనింగ్స్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘దంగల్’ తో చైనాలో ఆమిర్‌ఖాన్ ఇమేజ్ శిఖరస్థాయికి చేరింది. ఆయనకు ఉన్న పాపులారిటీ కారణంగానే ‘సీక్రెట్ సూపర్ స్టార్’ భారీ ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. మున్ముందు వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటివరకు ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 450 కోట్లు రాబట్టినట్టుగా అంచనా. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బంపర్ వసూళ్లు సాధిస్తుండటంతో బయ్యర్ల పంట పండింది.
తన చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా ఎప్పుడూ సామాజిక అంశాలనే ఇతివృత్తంగా తీసుకొని చిత్రాలు నిర్మించే నటుడు ఆమిర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తూ గతంలో రైతుల సమస్యలు, సామాజిక రుగ్మతలపై చిత్రాలను అందించారు. ఆయన మరోసారి సామాజిక అంశాన్నే ఇతివృత్తంగా తీసుకొని ఒక కొత్త డైరెక్టర్‌తో చేసిన ప్రయోగం ఈ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’. ‘దంగల్’ భారీ విజయం సాధించిన తర్వాత ఆయన నటించిన చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’ .జైరా వసీమ్, మెహర్ విజ్, రాజ్ అరున్, తిర్థ్ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.