తాను సాధించలేకపోయిన పతకాన్ని తన పిల్లలతో సాధించాలని తపించాడు.. తన ఇద్దరు కూతుళ్లకు స్వయంగా శిక్షణ ఇచ్చి గెలిపించి మల్ల యుద్ధంలో వీరుడనిపించుకున్నాడు. అతనే మహవీర్ సింగ్ పొగట్. తన పిల్లలే గీతా పొగట్, బవితా పొగట్.. ఈ సినిమాయే బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. ప్రపంచ స్థాయిలో భారతీయ చిత్రం ‘బాహుబలి2’ మించింది లేదని మీసం మెలేస్తున్న సమయంలో చైనాలోకి దూకి ఆ మీసం మెలిని అడ్డుకుంది. కొత్త రికార్డులను సృష్టించింది. ఆ చిత్రమే ‘దంగల్’. ఓ మల్ల యోధుడి జీవిత కథను వెండితెరపై ఆవిష్కరిస్తే ప్రేక్షక జనం నిరాజనాలు పలికారు. అంతేకాదు ఈ సినిమా ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలిచింది.
ఇదంతా దేనికోసమంటే..ఓ సినిమా హిట్ కొడితే ఆ తరహా చిత్రాలు క్యూ కడతాయి. అది చిత్రసీమలో కామన్. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ …ఇలా ఏ వుడ్ చూసినా బయోపిక్‌ల పరంపరే నడుస్తోంది. అందరి కంటే బయోపిక్‌ల రుచిని బాగా ఆనందించిన హీరో అమిర్ ఖాన్. ఇప్పుడు మరో బయోపిక్ చేయబోతున్నాడు. అదీ కూడా ఓ ప్రముఖుడే. అతనే మొదట వ్యోమగామి రాఖేష్ శర్మ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. 1984లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు ఇతను. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థిగా చేరి 1971లో పైలట్‌గా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ బాధ్యతలు పొందారు. 1982 భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఎంపికయ్యారు. రెండేళ్ల తర్వాత మన దేశం తరఫున మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి వ్యక్తిగా చరిత్రకెక్కారు. ఇప్పుడు ఈయన జీవిత కథను సినిమాగా తీయబోతున్నారు. ఈ విషయాన్ని అమిర్ ఖానే స్వయంగా వెల్లండించారు. ఈ చిత్రం నిర్మాణంలో రోనియో స్క్రావెలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో కలసి అమిర్ కూడా భాగస్వామిగా ఉంటున్నారు. ఈ సినిమాకు ‘సెల్యూట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రారు కపూర్ ఫిల్మ్ బ్యానర్లో తెరకెక్కనుంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ ‘థంగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ‘లో నటిస్తున్నారు. అమితాబ్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కత్రినా కైఫ్ కథానాయికగా చేస్తోంది.