సినీవినోదం రేటింగ్ : 3/5
ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ… సాఫ్ట్ వేర్ ఉద్యోగి బండి సూర్య ప్రకాష్(అల్లరి నరేష్) చక్కటి కుటుంబంతో హాయిగా ఉంటాడు. మీనాక్షి(నవమి)తో పెళ్లి కూడా కుదురుతుంది. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటోన్న సమయంలో పౌర హక్కుల నేత రాజగోపాల్ హత్య కేసులో సూర్యను సీఐ కిషోర్(హరీష్ ఉత్తమన్) అరెస్ట్ చేస్తాడు. తనకే పాపం తెలియదని సూర్య చెప్పినా పోలీసాఫీసర్ కిషోర్ వినిపించుకోడు. హత్య చేసినట్లు ఒప్పుకోమని చావగొడతారు పోలీసులు. అండర్‌ట్రైల్ ఖైదీగా చంచల్ గూడ జైలుకి వెళతాడు సూర్య. అక్కడే ఐదేళ్ళు గడిచిపోతాయి. అదే సమయంలో లాయర్ ఆద్య(వరలక్ష్మి శరత్‌కుమార్) ఎంటర్ అవుతుంది. సూర్యకేసుని టేకప్ చేయడమే కాదు.. పోలీసులు అతన్ని కావాలనే కేసులో ఇరికించారని నిరూపించి నిర్దోషిగా బయటకు తెస్తుంది. అకారణంగా తనను కేసులో ఇరికించి తన జీవితాన్ని పాడు చేసిన సీఐ కిషోర్‌పై కేసు వేస్తాడు సూర్య. సెక్షన్ 211లో కేసు వేయడంతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. అసలు సూర్య హత్య చేయకుండానే సీఐ కేసులో ఎందుకు ఇరికించాలనుకుంటాడు? ఇంతకీ రాజగోపాల్‌ను ఎవరు హత్య చేస్తారు? అనేది తెలియాలంటే సినిమాలో చూడాలి…
విశ్లేషణ… ‘నాంది’ లో నరేష్ సీరియస్ రోల్ పోషించడంతో ఆసక్తినెలకొంది. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నరేశ్ కూడా ఈ చిత్రంపైఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి మీద అన్యాయంగా నేరం మోపిన పోలీసుల మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని చెప్పే పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 211 గురించిన సినిమా ఇది. తొలి సినిమాతోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు విజయ్ కనకమేడలను కచ్చితంగా అభినందించాల్సిందే. సినిమాను తెరకెక్కించిన తీరు బావుంది. కామెడీ బ్రాండ్ ఉన్న నరేశ్‌తో ఇలాంటి కాన్సెప్ట్ మూవీ చేయడం విశేషం. సినిమాను వీలైనంత సహజంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. తను తీయాలనుకున్న పాయింట్‌పైనే దృష్టి పెట్టి సినిమాను తెరకెక్కించిన తీరు బావుంది. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ భావోద్వేగ సన్నివేశాలు మనసును తాకుతాయి. అయితే కధనం మరింత పట్టుగా సాగితే బాగుండేది.
నటీనటులు… ‘నాంది’ లో నరేష్ నటుడిగా తనకు కేవలం ‘నవ్వించడమే కాదు.. ఏడిపించడం కూడా తెలుసు’ అని నిరూపించాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా, ఓ అండర్‌ట్రయల్ ఖైదీగా హృదయంగా నటించాడు. మేకప్, కాస్ట్యూమ్స్ సెట్ అయ్యాయి. ఇక అడ్వకేట్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒదిగిపోయింది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాకి ప్రధాన పాత్ర. తన అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను మరోలెవల్‌కి తీసుకెళ్లింది. ఏసీపీ కిషోర్ అనే నెగెటివ్ పాత్రలో హరీష్ ఉత్తమన్ మెప్పించారు. ప్రవీణ్, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికం… ‘నాంది’ లో పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా శ్రీచరణ్ పాకాల తన రీరికార్డింగ్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సిధ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ చోటా కే ప్రసాద్ పనితీరు చాలా బాగుంది. ‘ఆవేశం సమస్యని సృష్టిస్తుంది.. ఆలోచన దాన్నిపరిష్కరిస్తుంది’, ‘దేవుడు.. మంటలు ఆర్పడానికి నీళ్లు ఇస్తే.. గుండె మంటల్ని ఆర్పడానికి కనీళ్లు ఇచ్చాడు’ లాంటి డైలాగ్స్ గుండెల్ని హత్తుకుంటాయి – రాజేష్