‘ఇటీవల కాలంలో నన్ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రతి రోజు సోషల్ మీడియాలో విద్వేషపూరితమైన వ్యాఖ్యలను ఎదుర్కొంటున్నాను. అది మాత్రమే కాకుండా నన్ను తిడుతూ దారుణమైన పోస్టులు పెడుతున్నారు. అయితే వాటి ప్రభావం నాపై ఏమాత్రం పడలేదు. చెప్పాలంటే.. ప్రతీ పోస్టు తనకు ప్రేరణగా నిలుస్తున్నాయని..అలియా భట్ అన్నారు. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కుమార్తెగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అలియా.. తను నటించిన ‘రాజీ’, ‘2 స్టేట్స్’, ‘గల్లీభాయ్’ వంటి చిత్రాలతో నటిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో అలియా ఇటీవల బట్టల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. ఇటూ నటిగా, అటూ వ్యాపారవేత్తగా బిజీగా ఉన్న అలియా ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నేను ప్రస్తుతం ఎదుర్కొంటున్న విమర్శలు నాకు ఎన్నో విషయాలను నేర్పాయి. వాటిని చూశాక ఎదుటి వ్యక్తితో దయతో వ్యవహరించాలనే విషయాన్ని గ్రహించాను. అంతేకాదు మనం నివసిస్తున్న భూమి పట్ల కూడా ప్రేమగా వ్యవహరించాలని అర్థమైంది’’ అని అలియా చెప్పారు. అయితే దివంగత నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ బంధుప్రీతి(నెపోటిజం)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో స్టార్ కిడ్స్‌కు మాత్రమే అవకాశాలు ఇస్తారని.. బయట వ్యక్తులను తొక్కెస్తారంటూ నిర్మాత కరణ్ జోహార్, దర్శక, నిర్మాత మహేష్ భట్‌తో పాటు ఇతరులపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ధ్వజమెత్తారు. ఈ క్రమంలో అలియా భట్, రణ్‌బీర్ కపూర్లతో పాటు స్టార్ కిడ్స్ పై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ‘అలియా భట్ అందం, అభినయం, నటన లేకపోయినా స్టార్ హీరోయిన్గా ఎదిగారని.. ఇందుకు మహేష్ భట్ కూతురు కావడమే ఆమెకు ఉన్న ఎకైక అర్హత’ అంటూ ఆమెపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అలియా తన ప్రియుడు రణ్బిర్కు జంటగా ‘బ్రహ్మస్త్ర’లో నటిస్తున్నారు.
కొత్తింటి కోసం ఏకంగా రూ. 32 కోట్లు!… అలియా భట్ తన ప్రియుడు, నటుడు రణ్‌బీర్ కపూర్‌కు మరింత చేరువ కానుంది. అలియా తన ప్రియుడు నివసిస్తున్న అపార్ట్మెంట్లోనే ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారట. ముంబైలోని పాలి హిల్‌లో 2460 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిని తన సొంతం చేసుకున్నారని ఆంగ్ల మీడియా కథనాలు వెలువరించింది. సదరు అపార్ట్మెంట్లో రణ్‌బీర్‌ది ఏడో అంతస్థు కాగా ఆమెది ఐదో అంతస్థు. ఈ ఇంటికి గత నెలలోనే పూజ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అలియా కుటుంబంతో పాటు రణ్‌బీర్ ఫ్యామిలీ కూడా హాజరయ్యారు అలియా కొత్తిల్లు రణ్‌బీర్ ఫ్యామిలీ నివసించే కృష్ణ రాజ్ బంగ్లాకు అత్యంత సమీపంలో ఉంది. మొత్తానికి కాబోయే అత్తారింటికి, భర్తకు దగ్గరలోనే ఇల్లు సెట్ చేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అలియా కొత్తింటి కోసం ఏకంగా రూ. 32 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ ఇంటిని అందంగా తీర్చిదిద్దే బాధ్యతను ఆమె గౌరీఖాన్‌కు అప్పగించారు. అప్పటివరకు ఆమె తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి జుహులోనే ఉండనున్నారు.