సినీవినోదం రేటింగ్ : 3/5
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ పతాకాలపై త‌్రివిక్రమ్ రచన దర్శకత్వం లో అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధాంశం… బంటు (అల్లు అర్జున్), రాజ్ మనోహర్ (సుశాంత్)లు ఒకే ఆసుపత్రిలో ఒకే సమయానికి పుడతారు. అయితే, బంటు ఫ్యామిలీ మిడిల్ క్లాస్.. రాజ్ మనోహర్‌ది బాగా ఉన్నతమైన కుటుంబం. బంటు వాళ్ల నాన్న వాల్మీకి (మురళీ శర్మ) వీ ఏఆర్కే కంపెనీ అధినేత రామచంద్ర రావు (జయరామ్) దగ్గర పనిచేస్తుంటాడు. రామచంద్ర రావు, యశ్(టబు)ల కుమారుడే రాజ్ మనోహర్. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడం, తండ్రి వాల్మీకి పెట్టే ఓ రకమైన టార్చర్‌తో ఇబ్బందులు పడతాడు. అయితే ఈ క్రమంలోనే అమూల్య (పూజా హెగ్డే)తో బంటుకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. కాగా అప్పలనాయడు (సముద్రఖని) తన కొడుకు పైడితల్లి కోసం వీఏఆర్కే కంపెనీలో షేర్స్ కావాలని గొడవపెట్టుకుంటాడు. ఈ తరుణంలో రామచంద్ర రావుపై హత్యాయత్నం జరుగుతుంది. అయితే రామచంద్రరావును కాపాడిన బంటుకు ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. దీంతో రామచంద్రరావును కాపాడేందుకు వైకుంఠపురములో అనే బంగ్లాలోకి దిగుతాడు. అయితే చివరకు ఏం జరిగింది? అప్పలనాయుడు కుటుంబం నుంచి వీఆర్కే కంపెనీని, రామచంద్రరావు కుటుంబాన్ని కాపాడాడా? ఈ కథలోకి కాశీ(హర్షవర్దన్), సీత (సునీల్), పెద్దాయన (సచిన్), శేఖర్ (నవదీప్), ఎస్పీ(రాజేంద్ర ప్రసాద్) నివేదా పేతురాజ్‌లు ఎందుకు వస్తారు ? ఆస్పత్రిలో బంటుకు తెలిసిన నిజం ఏమిటి? రామచంద్రరావు అంటే వాల్మీకి కి ఎందుకు పడదు? బంటు రాజు ఎలా అయ్యాడు? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి ….
నటీనటులు… అల్లు అర్జున్ మధ్య తరగతి యువకుడిగా.. నిజం తెలిసినప్పుడు అల వైకుంఠపురములో తన సమస్యలను తీర్చుకుంటూ.. ఎలా ముందుకెళ్లాడనే క్యారెక్టర్‌లో బన్నీ చక్కగా నటించాడు . తండ్రి సైకోయిజంతో సతమతమవుతూ, ఏం చేయలేని స్థితిలో ఉండే ఓ సామాన్య కొడుకుగా అల్లు అర్జున్ జీవించేశాడు.ఇక బన్నీ డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమూల్య రోల్ లో పూజా హెగ్డే ని కేవలం గ్లామర్ కే ఉపయోగించుకున్నారు.. సుశాంత్, అతని లవర్‌గా నివేదా పేతురాజ్ చక్కగా నటించారు. మురళీశర్మ చక్కటి పాత్ర చేశారు. సందర్భానుసారం సముద్రఖని, అజయ్ విలనిజం బావుంది. జయరాం నటన భావోద్వేగాల పరంగా హైలైట్‌గా నిలిచింది.టబు, సచిన్ ఖేడేకర్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, సునీల్, హర్షవర్ధన్, సముద్రఖని, అజయ్ వారి పాత్రలకు న్యాయం చేశారు. మరోసారి కలిసిరాని పాత్రలో సునీల్ కనిపించాడు.