‘లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నందుకు నాకెలాంటి బాధ లేదు. అందుకు షేమ్‌గా కూడా ఫీలవడం లేదు’ అని అక్షయ్ కుమార్ అన్నారు. విలక్షణ పాత్రలకు, విభిన్న కథా చిత్రాలకు అక్షయ్ కేరాఫ్. తన ఇమేజ్‌కి అతీతంగా ‘గోల్డ్’, ‘ప్యాడ్‌మ్యాన్’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’, ఇటీవల వచ్చిన ‘2.0’లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. అద్భుత నటనతో విశేషంగా ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు. నటుడిగా తనలోని విలక్షణత్వాన్ని చాటుకున్నారు.
తాజాగా ఆయన స్పేస్ బేస్డ్ చిత్రం ‘మిషన్ మంగళ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఐదుగురు మహిళా వ్యోమగాముల జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అక్కీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్, కృతి కుల్హారి వ్యోమగాములుగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ మార్స్ మిషన్ ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. హీరోయిన్ల చిత్రంలో నటించడం ఇబ్బందిగా అనిపించడం లేదా? అనే ప్రశ్నకు అక్షయ్ స్పందిస్తూ…
‘ఈ చిత్ర స్క్రిప్ట్ మహిళలను కోరుకుంది. ఇందులో ఐదుగురు కథానాయికలు నిజ జీవితంలోని నిజమైన హీరోల పాత్రలను పోషిస్తున్నారు. మహిళలు ప్రధానంగా ఉన్న ఈ చిత్రంలో నటించడం వల్ల నేనేం షేమ్‌గా ఫీలవడం లేదు. అంతేకాదు సినిమాలో నా పాత్ర నిడివి ఎంత అనేది కూడా నాకు ముఖ్యం కాదు. నా పాత్ర ప్రభావం సినిమాపై, కథపై ఎంతగా ఉందనేదే నాకు ముఖ్యం. ‘మిషన్ మంగళ్’లో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. చాలా ప్రభావితం చేస్తుంది. మహిళలకు ప్రశంసలు వచ్చినంత మాత్రాన నేనేమి బాధపడను. ఈ హీరోయిన్లలాగా, ఐదు మంది హీరోలు వచ్చి సినిమా చేయలేరు కదా!’ (నవ్వుతూ) అని అన్నారు.
ప్రస్తుతం ‘కేసరి’, ‘గుడ్ న్యూస్’,’హౌస్ ఫుల్ 4′ చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటిస్తూ బిజీగా ఉన్నారు.