బాలీవుడ్ అంటే ఖాన్లదే ఆధిపత్యం. చిత్రసీమలో ఏ వార్త అయినా వాళ్ల పేరు లేకుండా ఉండదు. ఏ పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఆ త్రయం సినిమాలదే హవా. బాక్సాఫీస్ వద్ద ఖాన్ల సినిమాలు కురిపించే కాసులే ఎక్కువ. ఏ ప్రకటన చూసినా వాళ్లే కనిపించేవారు. ఇదంతా గతం. ఇప్పుడు వారి హవా తగ్గుతుందా? అంటే అవుననే చెప్పాలి. వారి స్థానాల్లో కొత్త నటులు వచ్చి చేరుతున్నారు. ఏటా ఇలా వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రకటనలు, వివిధ కార్యక్రమాల ద్వారా అధికంగా అర్జిస్తున్న వారి జాబితాలో ఆ ఖాన్లు లేకపోవడమే దీనికి సాక్ష్యం. టీవీ కమర్షియల్స్, బ్రాండ్లకు ప్రచారకర్త లుగా వ్యవహరించి ఎక్కువ సంపాదిస్తున్న వారి జాబితాను మంగళవారం విడుదల చేశారు…
ఆ జాబితాలో అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచారు. ఇలా నిలవడం ఇది మొదటిసారి కాదు. ఈయనతో పాటు కొత్తగా రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, దీపిక పదుకొనే, అలియా భట్ వంటి వారు ఈ జాబితాలో వచ్చి చేరారు. వీరందరిలోనూ అక్షయ్ కుమార్ ఏకంగా రూ. 100కోట్లు సంపాదించి తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. దీపికా, రణవీర్ మరోసారి ఈ జాబితాలో నిలిచారు. వీరిది రెండో స్థానం. అందులో రణవీర్ సింగ్ రూ. 84 కోట్లు, దీపికా పదుకొనే రూ.75 కోట్లు రాబట్టారు. అమితాబ్ బచ్చన్ రూ. 72 కోట్లు, అలియా భట్ రూ.68కోట్లు షారుఖ్ ఖాన్ రూ. 56 కోట్లు, సల్మాన్ ఖాన్లకు రూ. 40 కోట్లు వచ్చాయి. ఇక వరుణ్ ధావన్ రూ.48, కరీనా కపూర్ రూ 32 కోట్లు, కత్రినా కైఫ్ రూ.30 కోట్లు రాబట్టారు.