“నేను ఒకే జోనర్ కంఫర్ట్‌బుల్ అనుకుంటే.. నాకో ట్యాగ్ తగిలించేస్తారు. అందువల్ల అటువంటి ట్యాగ్‌లు నాకొద్దు. ఈ గేమ్ ట్యాగ్స్ నుంచి బయటే ఉంటా”…. అని అంటున్నారు అక్షయ్ కుమార్.
హాస్యం, యాక్షన్, రొమాంటిక్, దేశభక్తి, సామాజిక చిత్రాలు …ఇలా ఏ తరహా చిత్రాలు చూసినా అందులో అక్షయ్ కుమార్ చిత్రాలు ఉంటాయి. బాలీవుడ్‌లో ఏదో ఒక్క జోనర్‌కే పరిమితం కాని హీరో అక్షయ్. ఒక సారి ఒక జోనర్‌లో చేస్తే.. మరోసారి ఇంకో తరహా చిత్రాలు చేయడంలో అక్షయ్ ఘనాపాటి. మొదట్లో అక్షయ్ ‘ఖిలాడీ కుమార్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పుడంతా యాక్షన్ చిత్రాలే చేసేవారు. ఆ తర్వాత ఆ పదేళ్ళ ముద్రను తప్పించుకొని…హాస్యభరిత చిత్రాలు చేస్తూ అందరినీ నవ్వించాడు. యాక్షనే కాదు..నవ్వించే ప్రతిభ కూడా తనలో ఉందని నిరూపించుకున్నారు.
ఎప్పుడూ ఇదే జోనర్ సినిమాలే చేస్తే ఎలా? అని ఆ తర్వాత రొమాంటిక్ జోనర్‌కు మారారు. ప్రస్తుతం మాత్రం సామాజిక అంశాలతో కూడిన కథలు.. దేశభక్తి చిత్రాల్లో నటిస్తున్నారు. అక్షయ్ చిత్రసీమలోకి వచ్చి 25 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ….
‘మీకు ఏ జోనర్ కంఫర్ట్‌గా ఉంటుంద’న్న ప్రశ్నకు అక్షయ్ బదులిస్తూ…’నేను ఒక జోనర్ కంఫర్ట్‌బుల్ అనుకుంటే.. నాకో ట్యాగ్ తగిలించేస్తారు. అందువల్ల అటువంటి ట్యాగ్‌లు నాకొద్దు… ఈ గేమ్ ట్యాగ్స్ నుంచి బయటే ఉంటా. యాక్షన్ చిత్రాలు ఇష్టమే కానీ, అవి ఒక్కటే చేస్తే, నాకే కాదు ప్రేక్షకులకూ బోరుకొడుతుంది. ‘యాక్షన్ హీరో’ అనే ట్యాగ్‌ను నేను తగిలించదలుచుకోలేదు. అదేకాదు,ఇప్పుడు ఎటువంటి ట్యాగూ తగిలించుకోదలుచుకోలేదు. అన్ని రకాల చిత్రాలు చేయడమే నాకు హ్యాపీ. కొత్తగా, విభిన్నంగా, అందులోనూ రిస్క్, హాస్యం ఎక్కువగా ఉంటే.. వాటిని కచ్చితంగా చేస్తా. హాస్య చిత్రాల్లో కూడా విభిన్నమైనవి చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఏమనుకున్నారన్నది పక్కపెడితే…. ‘హౌస్‌ఫుల్ ‘ ఓ హంగామా చేసే హాస్య చిత్రం. ఈ తరహా చిత్రాలు చేయడం చాలా కష్టం. నేను చేస్తున్న ‘గుడ్ న్యూస్’ మాత్రం చాలా సీరియస్ సబ్జెక్ట్. కానీ అందులోనూ అద్భుతమైన కామెడీ ఉంది’ అని అన్నారు. ఈ హీరో తర్వాత చేస్తున్న సినిమా ‘గుడ్ న్యూస్’. కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వాని, దిల్జిత్ దొసాంజే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నా భార్య, కొడుకు భారతీయులే !
‘నేను ఇప్పుడు పాస్‌పోర్టుకి దరఖాస్తు చేసుకున్నా. దీని గురించే చాలా మంది నన్ను అడగడం బాధ కలిగించింది. అందుకే ఈ పాస్‌పోర్టు ద్వారా నేను భారతీయుడ్ని అని నిరూపించుకోవాలనుకుంటున్నా. దీనిపై విమర్శలకు ఇక అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నా. నా భార్య, కొడుకు భారతీయులే. నేను ఇక్కడే పన్నులు కడుతున్నా. కానీ కొందరు కావాలనే నాపై విమర్శలు చేస్తున్నారు”….అంటూ
అక్షయ్ కుమార్ వివరించారు. అక్షియ్ ది ‘కెనడా జాతీయత’ అంటూ చాలా సందర్భాల్లో అతని పై విమర్శలు వచ్చాయి.