బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్… సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత తనకు పౌరసత్వం గల కెనడాలో సెటిల్ అవ్వదలచుకున్నాడా? దేశభక్తి, సామాజిక చిత్రాలలో విజృంభించి నటించే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భారతీయ పౌరుడే కాదా? … కొన్నేళ్ల క్రితం తన దేశ పౌరసత్వంపై అక్షయ్ కుమార్ చాలా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం అతను విదేశాలకు వెళ్లినపుడు లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో అక్షయ్ పాస్‌పోర్ట్ చిక్కులు తెచ్చిపెట్టింది. అక్షయ్‌కున్నది ఇండియన్ పాస్‌పోర్ట్ కాదని, అది కెనడా పాస్‌పోర్ట్ అని ఒక వార్తా సంస్థ కొత్త విషయాన్ని అప్పుడే బయటపెట్టింది. అతని వికీపీడియా పేజ్‌ని మీరు చెక్ చేస్తే అక్షయ్‌ది కెనడా పౌరసత్వమని అందులో రాసి ఉంటుంది. సీన్ కట్ చేస్తే.. తాజాగా అక్షయ్ కుమార్ తాను కెనడా పౌరుడినని, భవిష్యత్తులో తాను ఆ దేశంలోనే స్థిరపడతానని చెప్పుకుంటున్న ఒక వీడియా వైరల్ అవుతోంది.
టోరంటోలో జరిగిన ఒక కార్యక్రమంలో అతను మాట్లాడుతున్నట్లు… ఆ వీడియా ద్వారా తెలుస్తోంది. అయితే, అది ఎప్పుడు జరిగిందనేది మాత్రం కచ్ఛితంగా తెలియడం లేదు. ఆ వీడియోలో అక్షయ్, నేను మీకో విషయం చెప్పాలి. ఇది నా ఇల్లు. టోరంటో నా ఇల్లు. ఈ పరిశ్రమ నుంచి రిటైర్ అయిన తర్వాత సంపాదించిన మొత్తం ఆస్తులతో నేను ఇక్కడికే రాబోతున్నాను అంటూ చెప్పడం వినవచ్చు.
అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. గతంలో తన పాస్‌పోర్ట్‌పై వివాదం చెలరేగినప్పుడు దీనిపై మీడియా వివరణ కోరడంతో తనకు కెనడాలోని యూనివర్సిటీ ఒకటి గౌరవ పౌరసత్వం ఇచ్చిందని అతను చెప్పుకొచ్చాడు. అంతేకాదు..తనకు ఇండియా, కెనడాలలో ద్వంద్వ పౌరసత్వం ఉందని కూడా అక్షయ్ వెల్లడించాడు. అయితే..అతని వాదనలో పస లేకపోవడానికి కారణం… భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని ఇవ్వదు. అలాగే కెనడా ఇప్పటివరకు ఆరుగురికి మాత్రమే గౌరవ పౌరసత్వాన్ని ఇచ్చింది. అలా పొందిన వారిలో నెల్సన్ మండేలా, మలాలా యూసఫ్‌జాయి ఉన్నారు తప్ప అక్షయ్ మాత్రం లేడు.