మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ పాత్రల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తుంటాడు బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్. మొదట యాక్షన్ సినిమాలకే పరిమితమైన అక్షయ్ అనంతరం విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇటీవల ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన ‘అత్యధిక పారితోషికం అందుకుంటున్నసెలబ్రెటీల జాబితా 2019’లో భారత్ నుంచి స్ధానం సంపాదించిన ఏకైక వ్యక్తిగా అక్షయ్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో అక్షయ్ జూన్ 2018 నుంచి ఈ ఏడాది జూన్ వరకూ మొత్తం రూ 444 కోట్ల సంపాదనతో ప్రపంచవ్యాప్తంగా 33వ స్థానంలో నిలిచారు.
అక్షయ్ ఈ విషయమై ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు… ‘ఫోర్బ్స్‌లో స్థానం సంపాదించినందుకు సంతోషంగా ఉంది. నా కష్టం వల్లే ఇదంతా సాధ్యమైంది. ప్రతి పైసా సంపాదించడానికి చాలా కష్టపడ్డా. డబ్బు నాకు ముఖ్యమే కానీ కొన్ని విషయాల్లోనే’ అని స్పష్టం చేశారు. అక్షయ్ ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలకు భారీ విరాళాలిచ్చిన విషయం తెలిసిందే. అక్షయ్ నటించిన ‘మిషన్ మంగళ్’ ఆగష్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది.
అజిత్ దోభాల్ పాత్రలో అక్షయ్
అక్షయ్‌కుమార్, దర్శకుడు నీరజ్‌పాండేది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో ‘స్పెషల్ 26’, ‘బేబీ’ వంటి చిత్రాలొచ్చాయి. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ అక్షయ్‌తో ‘రుస్తుం’, ‘టాయ్‌లెట్’ వంటి చిత్రాలను నిర్మించారు. తాజాగా అక్షయ్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో ఓ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్రమోదీకి జాతీయ భద్రతా సలహాదారుడిగా పనిచేస్తున్న అజిత్ దోభాల్ జీవితంలోని కొన్ని ఘట్టాలను కథగా మలచి సినిమాగా రూపొందించనున్నారు దర్శకుడు నీరజ్. ఇందులోఅజిత్ దోభాల్ జీవితంలోని ఎత్తు పల్లాలను.. సాధించిన ఘనతను చూపిస్తారనీ, ఇప్పటికే దర్శకుడు నీరజ్ పాండే అజిత్ దోభాల్ గురించి రీసెర్చ్ మొదలుపెట్టారని సమాచారం. ప్రధానమంత్రి కార్యాలయానికి ఐదో జాతీయ భద్రతా సలహాదారుడిగా పనిచేస్తున్న అజిత్ దోభాల్ పాత్రలో అక్షయ్ నటిస్తారని తెలుస్తోంది.