అన్నీ ‘అర్జున్ రెడ్డి’ కాలేవు ….. ‘ఆర్ ఎక్స్ 100’ చిత్ర సమీక్ష

                                                 సినీవినోదం రేటింగ్ : 2/5
కె.సి.డ‌బ్ల్యు పతాకం పై అజ‌య్ భూప‌తి దర్శకత్వం లో అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే….

శివ (కార్తికేయ) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే, డాడి(రాంకీ) అన్ని తానై శివను పెంచుతాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కాగా ఇందు (పాయల్ రాజపుత్‌) శివను చూడగానే ఇష్టపడుతుంది. కావాలని అతన్ని టీజ్ చేస్తూ, వెంట పడుతూ శివని ప్రేమలో దింపుతుంది. ఇద్దరు శారీరకంగా దగ్గరవుతారు. ఇందు మాటలకి చేతలకి శివ ఇంకా డీప్ ప్రేమలోకి వెళ్తాడు. ‘పెళ్లి చేసుకుందాం’ అని ఇందుని అడిగితే.. ఇందు మా నాన్న(రావు రమేష్)కి చెప్పి ఒప్పిస్తానని వెళ్తుంది. ఆ తర్వాత… రావు రమేష్ ఇందుకి పెళ్లి చేసి అమెరికా పంపించేశాడని శివకు తెలుస్తోంది. శివ తాగుతూ పిచ్చోడిలా ఇందు కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. .ఆ క్రమంలో ఇందుకు పెళ్లి చేసింది రావు రమేష్ కాదని తెలుస్తోంది. అసలు ఇందు, మహేష్ అనే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది ?.శివని అంతలా ప్రేమించిన ఇందు ఎందుకు అతనికి కనబడకుండా పోయింది ? ప్రేమ కోసం రోజురోజుకి పిచ్చోడిలా అయిపోతున్న శివను మార్చటానికి డాడి (రాంకీ) ఏం చేశాడు ? అసలు మళ్ళీ శివ,ఇందు కలుసుకుంటారా ? తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే ….

విశ్లేషణ…
దర్శకుడు అజయ్‌ భూపతి.. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను దృష్టిలో పెట్టుకొని బోల్డ్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. అయితే తను అనుకున్న కథను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో మాత్రం ఫెయిల్‌ అయ్యాడు. చివ‌రి ప‌దిహేను నిమిషాల కోసం మొత్తం క‌థ‌ను రాసుకున్న‌ట్లుఅనిపిస్తుంది.

సెకండాఫ్ లో సాగతీతతో విసుగు తెప్పిస్తుంది. పైగా సినిమాలో కామెడీ కూడ కరువైంది. అసలు ఈ చిత్రానికి `ఆర్ ఎక్స్ 100`అని టైటిల్‌ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. లవ్‌ ట్రాక్‌ కూడా ఆసక్తికరంగా లేదు. ప్రేమ‌లో ఎమోష‌న్ ఎక్క‌డా క‌న‌ప‌డ‌దు. హీరో హీరోయిన్‌ల మధ్య ప్రేమ కన్నా… బోల్డ్‌ గా తెరకెక్కించాలన్న ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది. అవసరానికి మించి మసాలా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. మసాలా ముద్దుల సీన్స్ పెట్టేస్తే.. ప్రేక్ష‌కులు సినిమాను చూసేస్తార‌ని అనుకున్నట్లున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

నటీనటులు ….
హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నంలో నటనతో, డ్యాన్సులతో, ఫైట్స్ తో కార్తికేయ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ గురించి అసలు విషయం తెలుసుకున్న సన్నివేశంలో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని కార్తికేయ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు.హీరోయిన్ పాయల్ చ‌క్క‌గా న‌టించింది. బోల్డ్ క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో నటించిన రాంకీ కూడా డాడి పాత్రలో ఒదిగిపోయారు. ఇక రావు రమేష్ ఎప్పటిలాగే తనకు మాత్రమే సాధ్యమైన హావ భావాలతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసారు.
సాంకేతిక వర్గం….
చైత‌న్ భ‌ర‌ద్వాజ్ అందించిన ట్యూన్స్‌లో ‘కొడ‌వ‌లి నిండా కుంకుమ పూలే’, ‘పిల్లారా’ పాట‌లు బావున్నాయి.పాటల చిత్రీకరణ ఆకట్టుకోదు . నేప‌థ్య సంగీతం చెప్పుకోదగ్గట్లు లేదు. .రామ్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది.పెల్లెటూరి విజువల్స్ ను ఆయన చాలా బాగా చూపించారు. ఎడిట‌ర్ ప్ర‌వీణ్ క‌త్తెర‌కు ఇంకా ప‌ని చెప్పి ఉంటే బావుండేది – రవళి