నేను చాలా కష్టపడే అవకాశాలు పొందాను అంటోంది నటి అదితిరావ్. ఈ బాలీవుడ్ బ్యూటీ మణిరత్నం చిత్రం కాట్రువెలియిడై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. అందులో నటుడు కార్తీతో రొమాన్స్ సన్నివేశాల్లో చాలా సన్నిహితంగా నటించి గుర్తింపు పొందింది. హిందీలోనూ నటిస్తున్న అదితిరావ్ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న పద్మావత్ చిత్రంలోనూ కీలకపాత్రను పోషించింది. తాజాగా మణిరత్నం ఈ అమ్మడికి మరో చాన్స్ ఇచ్చారు. ఆయన తాజా చిత్రం సెక్క సివంద వానం చిత్రంలో అరవిందస్వామి, శింబులతో కలిసి నటిస్తోంది. ఇందులో నటి జ్యోతిక, ఐశ్వర్యరాజేశ్ కూడా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా నటి అదితిరావ్ తన భావాలను పంచుకుంది. అవేమిటో చూద్దాం. నేను చిన్నతనం నుంచి మణిరత్నం అభిమానిని. బొంబాయి చిత్రం చూసి అందులోని నటి మనీషాకొయిరాలలా అవ్వాలని కలలు కన్నాను. అందుకే డాన్స్‌ను నేర్చుకున్నాను. అలాంటి తరుణంలో మణిరత్నం నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. కాట్రువెలియిడై చిత్రంలో నటించే అవకాశం రావడంతో పట్టరాని సంతోషం కలిగింది. ఆయన నటీనటుల నుంచి చాలా సున్నితంగా నటనను రాబట్టుకోవడంలో దిట్ట.
మణిరత్నం కిందకు దూకమన్నా ఆలోచించకుండా దూకేస్తాను. విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించాలని ఆశపడుతున్నాను. సినీ కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు రావడం సులభం. అలాంటి నేపథ్యం లేనివారు ఈ రంగంలో ఎదగడం కష్టతరం. నేను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చాను. నటిగా సపోర్టు చేయడానికి ఎవరూ లేరు. చాలా కష్ట పడే అవకాశాలు అందుకున్నాను. నిజం చెప్పాలంటే నాకు టర్నింగ్ ఇచ్చే కథా పాత్ర ఇంకా అమరలేదు. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను అని నటి అదితిరావ్ పేర్కొంది.