ప్రముఖ నటుడు-నటగురువు దేవదాస్‌ కనకాల మృతి!

పరిశ్రమలో నటగురువుగా పేరుపొందిన ఆయన దేవదాస్‌ కనకాల. గతకొంతకాలంగా అస్వస్థతకు గురైన ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.ఆయనకు నటనంటే ఇష్టం. నటన నేర్పడమంటే ఇంకా ఇష్టం. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌ నుంచి నేటి తరం కుర్రహీరోల వరకు చాలా మందికి నటనలో శిక్షణ ఇచ్చారు. ఆయన భార్య లక్ష్మి ఇటీవలె మృతి చెందారు. దేవదాస్‌ కనకాల వయసు 74 ఏళ్లు. 1945 జులై 30న యానాంలో పుట్టారు. అక్కడికి సమీపంలోని కనకాల పేట స్వస్థలం. ఆయన తండ్రి కనకాల పాపయ్య నాయుడు యానాం ఫ్రెంచి పాలనలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆంధ్రా యూనివర్శిటీలో థియేటర్‌ ఆర్ట్స్‌ చదివారు. ఆ తర్వాత పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణపొందారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక తెలుగు సినిమా పరిశ్రమలో సరైన ఆదరణ దొరక్కపోవడంతో నొచ్చుకున్నారు.
 
అప్పుడే మినిస్టరీ ఆఫ్‌ ఇండియాలో భాగమైన ‘సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌’లో ఉద్యోగ అవకాశాలున్నాయని తెలిసి దరఖాస్తు చేసుకుని, ఉద్యోగం సంపాదించుకున్నారు. అక్కడే ఆయనకు లక్ష్మి పరిచయమయ్యారు. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. తనకన్నా వయసులో పెద్దదైన లక్ష్మిని ఆయన సన్నిహితుల సమక్షంలో యాదాద్రిలో పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మద్రాసు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో టీచర్‌గా జాయిన్‌ అయ్యారు. 1975లో అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ‘ఓ సీతకథ’తో నటుడిగా తెరంగేట్రం చేశారు. ‘మాంగల్యానికి మరోముడి’, ‘సిరిసిరిమువ్వ’, ‘గోరింటాకు’, ‘మంచుపల్లకి’, ‘చెట్టుకింద ప్లీడర్‌’, ‘పెదబాబు’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ఒక్క మగాడు’, ‘కింగ్‌’, ‘జోష్‌’, ‘శుభప్రదం’, ‘రోబో’ తో పాటు ఇంకా పలు చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. ఆఖరిగా ‘భరత్‌ అనే నేను’లో నటించారు. ‘ప్రేమబంధం’ చిత్రంలో ఆయన భార్య లక్ష్మి కనకాల అత్తగానూ, దేవదాస్‌ కనకాల అల్లుడిగా నటించారు. ‘నిజం’, ‘చలిచీమలు’, ‘నాగమల్లి’, ‘పుణ్యభూమి కళ్లు తెరిచింది’, ‘ఓ ఇంటి బాగోతం’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
తాను శిక్షణ ఇచ్చిన విద్యార్ధులతో వర్క్‌ చేయించి ఓ చిత్రం చేయాలనుకున్నారు దేవదాస్‌ కనకాల. ఆ సమయంలో ఆయన కోరిక తెలుసుకున్న కొందరు ప్రోత్సాహించారు. దీంతో ‘నిజం’ అనే సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. నిర్మాణం కూడా ఆయనే చేపట్టడంతో సినిమా కష్టాలేంటో తెలిశాయట. నిర్మాతగా మారిన తర్వాత చాలా కష్టాలు తెలిసి వచ్చాయని, అందుకే ఆ తర్వాత నిర్మాణం వైపు చూడలేదని ఆయన చెప్పేవారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌, శుభలేఖ సుధాకర్‌, భానుచందర్‌, రఘువరన్‌, నాజర్‌తో పాటు ఈతరం నటీనటులు పలువురికి ఆయన నటనలో శిక్షణనిచ్చారు. ఆయన కుమారుడు రాజీవ్‌ కనకాల, కోడలు సుమ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. మనవడు రోషన్‌ కనకాల కూడా ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రంలో నటించారు.
అక్కర్లేని రాయిని మాత్రమే తీసేశా !
దేవదాస్‌ కనకాల దృష్టిలో ఎవరైనా ఉత్తమ నటుల్ని తీర్చిదిద్దొచ్చు. దీని గురించి ఆయన ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ… ‘‘ఒక గొప్ప శిల్పం చూసిన ఒకాయన ఆ శిల్పాన్ని చెక్కిన శిల్పితో ‘ఎంత అద్భుతంగా తయారు చేశావయ్యా’ అన్నారట. ఆ శిల్పి ‘ఈ శిల్పం రాయిలోనే ఉంది. అక్కర్లేని రాయిని మాత్రమే తీసేశా’ అన్నారట. ఎంత గొప్ప మాట అది! చాలామంది బార్న్‌ యాక్టర్స్‌ అని చెబుతుంటారు. అలాంటిదేమీ ఉండదు. లోపల ఉన్న భావాన్ని ఇంప్రూవ్‌ చేసి బయటికి అద్భుతంగా వ్యక్తీకరించటమే మంచి నటన’’ అని చెప్పారు