సినిమా నిర్మాణం రిస్క్ అనిపించడం లేదు !

నాగార్జున,నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, వైజయంతీ మూవీస్ పతాకాలపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సి.అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘దేవదాస్’. ఈ సినిమా ఈనెల 27న విడుదలకానుంది. ఈ నెల 20న ఆడియో విడుదలవుతుంది. ఇక వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ 45 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత సి.అశ్వనీదత్‌తో ఇంటర్వూ విశేషాలు…
 
ఏఎన్‌ఆర్ బర్త్‌డే నాడు ఆడియో…
నిర్మాతగా ఇది నాకు 45వ చిత్రం. ఒకప్పుడు పలు మల్టీస్టారర్ సినిమాలను నిర్మించిన మా సంస్థలో ప్రస్తుతం ‘దేవదాస్’ వంటి మల్టీస్టారర్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈనెల 20న అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా సినిమా ఆడియోను విడుదల చేస్తున్నాం. అలాగే ఈనెల 27న సినిమాను రిలీజ్ చేస్తున్నాం.
తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాలు…
మా అమ్మాయిలు స్వప్న, ప్రియాంక లీడర్‌షిప్‌లో తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయాలనుంది. కోల్‌కతా మెయిల్, కంపెనీ తర్వాత హిందీ సినిమాలు నిర్మించలేదు. నాగ్‌అశ్విన్ కూడా హిందీలో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి బాలీవుడ్‌లోకి మళ్లీ అడుగుపెట్టాలని ఆసక్తిగా ఉన్నాం. వయాకామ్ మోషన్ పిక్చర్స్ 18 సంస్థ మాకు భాగస్వామిగా ఉంటుంది. అలాగే తమిళంలో కూడా సినిమాలు చేయాలనుంది.
స్నేహానికి గొప్ప నిర్వచనం…
నా మిత్రుడు శ్రీధర్‌బాబు సింపుల్‌గా ‘దేవదాస్’ స్టోరీ లైన్ చెప్పారు. అది బాగుందని అనిపించడంతో ఈ సినిమా చేశాం. భూపతిరాజా ఆ కథకు మంచి స్క్రిప్ట్‌ను అందించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సినిమా అద్భుతంగా తెరకెక్కింది. ఇంజనీరింగ్ చదువుకున్న ఈ కుర్రాడు సినిమాను చక్కగా హ్యాండిల్ చేశాడు. స్నేహానికి గొప్ప నిర్వచనాన్ని ఈ సినిమాలో చూపించాం. మా సంస్థ ద్వారా పరిచయమైన మణిశర్మ మాతో చేసిన 17వ సినిమా ఇది. ఆయన చక్కటి సంగీతాన్ని అందించారు.
ఎక్కువ సినిమాలు ఆయనవే…
‘ఆజాద్’ తర్వాత నాగార్జునతో చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో ఆయన అద్భుతంగా నటించారు. తన పాత్రలో లీనమై సినిమా చేశారు. నానీ తనదైన శైలిలో సహజంగా నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా చక్కగా రూపుదిద్దుకుంది. మా బ్యానర్‌లో చిరంజీవి నాలుగు సినిమాలు, కృష్ణ నాలుగు సినిమాలు చేశారు. ఇప్పుడు ‘దేవదాస్’ సినిమాతో నాగార్జున మా బ్యానర్‌లో ఐదు సినిమాలు చేశాను. దీంతో మా బ్యానర్‌లో ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఆయనే.
ఎంతో ప్రతిష్టాత్మకంగా…
సావిత్రి జీవిత కథతో మేము ‘మహానటి’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం. స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్ కలిసి చేసిన సినిమా ఇది. సినిమా నిర్మాణంలో ఏమాత్రం రాజీపడలేదు.
తదుపరి చిత్రాలు…
దర్శకుడు నాగ్ అశ్విన్ తన నెక్స్ సినిమా కథను రాస్తున్నాడు.నాకెంతో ఇష్టమైన దర్శకుడు అట్లీతో జనవరి నుంచి ఓ సినిమా మొదలుపెడుతున్నాం. ఎన్టీఆర్‌తో కూడా ఓ సినిమా చేస్తాం. మా బ్యానర్‌లో విజయ్ దేవరకొండతో రెండు సినిమాలుంటాయి. విజయ్‌తో తీసే మొదటి సినిమాను రాజ్ , డి.కె. డైరెక్ట్ చేస్తారు.

వందేళ్లు ఉంటుంది…
నిర్మాతగా నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను. నేను తాతలతో సినిమాలు తీశాను… తండ్రులతో తీశా, మనవళ్లతో సినిమాలు తీస్తున్నాను. 45 ఏళ్లుగా కొనసాగుతున్న మా బ్యానర్‌ను మా అమ్మాయిలు 100 ఏళ్ల పాటు ముందుకు నడిపిస్తారు. మా సంస్థకు ఓ రోజు తెల్లవారుజామున ఎన్‌టి రామారావు వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు. ఆ పేరు బలంతో మా సంస్థ వందేళ్లు తప్పకుండా ఉంటుంది.
రిస్క్ అనిపించడం లేదు…
నేను చిత్ర పరిశ్రమకు వచ్చినప్పుడు 10 శాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉండేది. కానీ ఇప్పుడు శాటిలైట్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ మూలంగా నిర్మాతలకు సినిమా నిర్మాణం పెద్దగా రిస్క్ అనిపించడం లేదు. మల్టీప్లెక్సులు రావడంతో సినిమా ఫస్ట్ వీక్ షేర్లు బాగానే వస్తున్నాయి. దీంతో నిర్మాతలకు పెట్టిన డబ్బులు వచ్చేస్తున్నాయి.