రాయడంలో ఫెయిల్…. ‘ఏబీసీడీ’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2/5

మధుర ఎంటర్తైన్న్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ సంజీవ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు

కధలోకి వెళ్తే… అర‌వింద ప్ర‌సాద్‌(అల్లు శిరీష్‌) అమెరికాలో పుట్టి పెరిగిన ఇండియ‌న్‌. తండ్రి మిలియ‌నీర్ కావ‌డంతో ఖ‌ర్చు విష‌యంలో అర‌వింద్ ముందు, వెనుకా ఆలోచించ‌కుండా ఖ‌ర్చు పెడుతుంటాడు. అయితే అర‌వింద్ తండ్రి (నాగ‌బాబు) మాత్రం కొడుక్కి డ‌బ్బు విలువ తెలియ‌జెప్పాల‌ని చాలా సార్లు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతాడు. చివ‌ర‌కు ఆయ‌నొక ఆలోచ‌న చేస్తాడు. కొడుకు అర‌వింద్‌ని, అత‌ని స్నేహితుడు బాల షణ్ముగం అలియాస్ భాషా(భ‌ర‌త్‌)ని ఇండియా టూర్‌కి వెళ్ల‌మంటాడు. ఇండియా వ‌చ్చిన అర‌వింద్ అలియాస్ అవి ఖ‌ర్చుల‌కు తండ్రి డ‌బ్బులు కేవ‌లం ఐదు వేల రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తాడు. ఉన్న దాంట్లో పొదుపుగా రోజుకి రూ.83 మాత్ర‌మే ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. ఈలోపు తండ్రి అవిని, భాషాని ఎంబీఏ కాలేజ్‌లో జాయిన్ చేయిస్తాడు. అక్క‌డ అవికి నేహ‌(రుక్స‌ర్ థిల్లాన్‌) ప‌రిచ‌యం అవుతుంది. క్ర‌మంగా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరుగుతుంది. అయితే ఓ సంద‌ర్భంలో అవి రోజుకి 83 రూపాయ‌లు మాత్ర‌మే ఖర్చు పెడుతున్నాడ‌నే విష‌యం మీడియాకి తెలిసిపోయి పాపుల‌ర్ అయిపోతాడు. మ‌రో వైపు మినిష్ట‌ర్‌(శుభ‌లేక సుధాక‌ర్‌), తన కొడుకు భార్గ‌వ్‌(రాజా)ని రాజ‌కీయ వార‌సుడిని చేయాల‌నుకుంటాడు. అందుకోసం ప్ర‌జ‌ల్లో ఉండ‌మ‌ని స‌ల‌హా ఇస్తాడు. నేతాజీ న‌గ‌ర్ వాసులు కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీని మూసి వేయాల‌ని చాలా ఏళ్లుగా ప్ర‌భుత్వానికి మొర పెట్టుకుంటూ ఉన్నా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. భార్గ‌వ్ కూడా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోడు. ఓ కార‌ణంగా అవి, భార్గ‌వ్ కంటే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంటాడు. త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు అవిని భార్గ‌వ్ ఎలా వాడుకోవాల‌నుకుంటాడు? అవి ఏం చేస్తాడు? చివ‌ర‌కు అవికి డ‌బ్బు విలువ తెలుస్తుందా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ… మలయాళంలో సూపర్‌ హిట్ అయిన ‘ఏబీసీడీ’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్ది పాటు మార్పులతో రీమేక్‌ చేశాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి.ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి మాతృక‌లో పెద్ద హిట్ అయిన సినిమాను తెలుగు నెటివిటీకి అనుగుణంగా రీమేక్ చేయ‌లేక‌పోయాడు. సినిమాలో ఆర్టిఫీషియాలిటీ చాలా సన్నివేశాల్లో ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోతుంది.కథ పరంగా బాగానే ఉన్నా కథనంలో ఏదో మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. బలమైన సంఘర్షణ ..బలమైన సన్నివేశాలు లేకపోవటం నీరసం కలిగిస్తుంది. ఇండియా వచ్చిన తరువాత హీరో ఇబ్బంది పడే సన్నివేశాల్లో మరింత కామెడీ, ఎమోషన్స్‌ చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు సాదా సీదాగా నడిపించేశాడు. జీవితం విలువ, డబ్బు విలువ తెలుసుకున్న హీరో… వాటి విలువ తెలుసుకున్నానని డైలాగ్ ల రూపంలో కాకుండా, సన్నివేశాల రూపంలో చూపించి ఉంటే బావుండేది.సెకండాఫ్‌లో స‌న్నివేశాలు మ‌రీ బోరింగ్‌ అనిపిస్తాయి. సినిమాలో కామెడీ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించిందే కానీ.. అంతగా ఎంట‌ర్‌టైన్ చెయ్యలేదు.
నటీ నటులు… అల్లు శిరీష్ ఈ సినిమాను ప్ర‌త్యేకంగా ఎందుకు ఎంచుకున్నాడ‌నేది అర్థం కాదు.ఎలాంటి రెస్పాన్సిబులిటీ లేకుండా లైఫ్‌ను ఎంజాయ్‌ చేసే కుర్రాడి పాత్రలో అల్లు శిరీష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో కొంత బెటర్ . ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లోనూ బాగానే చేసాడు. బాలనటుడిగా సుపరిచితుడైన భరత్‌ ఈ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యి … పాత్రానుగుణంగా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు.. కానీ విఫలమయ్యాడు.ఇక రుక్స‌ర్ థిల్లాన్ పాత్రకు పెద్ద‌గా స్కోప్ లేదు. లుక్స్‌ పరంగా మాత్రం మంచి మార్కులు పడతాయి. హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ మొక్కుబడికి పెట్టినట్లుంది. ఇక తండ్రి పాత్ర‌లో నాగ‌బాబు ఒదిగిపోయాడు. ఇక మెయిన్ విల‌న్‌గా న‌టించిన రాజా పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించాడు. వెన్నెల కిషోర్ పాత్ర చిన్న‌దే అయినా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు.శుభలేక సుధాకర్‌, కోట శ్రీనివాసరావు తమ పాత్రల మేర చేసారు.
 
సాంకేతిక వర్గం… జుడా సాండీ అందించిన సంగీతం ప‌రావాలేదు. ‘మెల్ల మెల్ల మెల్ల మెల్లగా’ పాటతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఓకే. రామ్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. అమెరికాలో తెరకెక్కించిన సీన్స్‌తో పాటు హైదరాబాద్‌లోని స్టమ్‌లో తెరకెక్కించిన సన్నివేశాలను కూడా బాగా చిత్రీకరించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. సంభాష‌ణ‌లు చెప్పుకోదగ్గవి లేవు – రాజేష్