అమీర్ పిల్లలు సినిమాల్లోకి వస్తున్నారు !

అమిర్‌ ఖాన్‌… తన బయోపిక్‌ను తన కుమారుడు జునైద్ ఖాన్‌ చేయగలడు అని విశ్వాసం వ్యక్తం చేశారు బాలీవుడ్‌ కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌. అంతేకాదు… జునైద్‌ బాలీవుడ్ అరంగేట్రం కోసం ఓ మంచి స్క్రిప్టు కోసం చూస్తున్నట్లు చెప్పారు. కుమార్తె ఇరా కూడా సినిమా రంగంలోకి రావాలని సిద్ధమవుతోందట. జునైద్,ఇరా అమీర్ మొదటి భార్య రీమా పిల్లలు. అమీర్ ఆ తర్వాత కిరణ్ రావు ను పెళ్లి చేసుకున్నారు.ముంబయిలో ఆమిర్‌ బయోపిక్‌ గురించి విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ… దానికి జునైద్‌ ఉత్తమ ఎంపికని అభిప్రాయపడ్డారు. నాకు తెలిసి జునైద్‌ నా బయోపిక్‌ చేయగలడు. అతడే సరైన ఛాయిస్‌. అతడు నటనలో శిక్షణ పొందాడు. దాదాపు ఏడాదిగా రంగస్థల నాటకాల్లో చేస్తున్నాడు. కానీ నేను స్క్రీన్‌ టెస్ట్‌ను నమ్ముతాను. కాబట్టి జునైద్‌ ఓ పద్ధతిలో తనేంటో నిరూపించుకోవాలి. ఓ తండ్రిగా అతడికి నా సూచన ఏంటంటే.. కేవలం హీరో పాత్రను చేయడమే కాకుండా అందులో లీనం కావాలి. ఓ హీరోగా ఉండటమే కాదు.. స్క్రీన్‌పై ఆ పాత్రలో జీవించాలి. అదే నటనలో ఉండే సంతోషం. దాన్ని ప్రతి నటీనటులు నమ్మాలి అని ఆమిర్ పేర్కొన్నారు.

అందంగా కనిపించాలనుకుంటున్నా!
అమీర్ ఖాన్,అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే ‘దంగల్’ చిత్రం కోసం భారీగా లావు అయిన అమీర్ ఖాన్..ఆ తర్వాత తన శరీరాకృతిని మళ్లీ యథాస్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ సారి తీయనున్న కొత్త ప్రాజెక్టులో చాలా స్లిమ్ గా, అందంగా కనిపించాలనుకుంటున్నాడట అమీర్ ఖాన్.
 
తన కొత్త ప్రాజెక్టు విషయంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్క్వూలో అమీర్ చెప్పాడు. ఈ సారి నా చేతిలో నాలుగు మంచి కథలున్నాయి. అయితే వీటిలో ఏ కథను ఎంచుకుంటానో ఇప్పుడే చెప్పలేను. నా కొత్త సినిమా గురించి నెలలోనే అందరికీ తెలియజేస్తా. ఈ సినిమా నేనే నిర్మిస్తాను. అంతేకాకుండా స్లిమ్ గా మారేందుకు నా డైట్ ను త్వరలోనే ప్రారంభిస్తా. దీంతోపాటు వర్కవుట్స్ కూడా చేస్తా. ప్రస్తుతానికి నాలుగింటిలో రెండు కథల్లో నా పాత్ర స్లిమ్ గా కనిపించాల్సి ఉంటుంది. అందుకోసం నా శరీరాకృతిని మార్చుకునే పని ప్రారంభిస్తానని చెపుకొచ్చాడు