లెజెండ్ లైవ్ కాన్సర్ట్ ఇస్తున్నాడంటే.. జనాలు ఎగబడి చూడటం కామన్. ఏఆర్ రెహమాన్.. ఆస్కార్ విన్నర్, ఇండియా గర్వించదగిన మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడు. అంతటి లండన్ కాన్సర్ట్కూ ఫ్యాన్స్ అలాగే వచ్చారు. కానీ రెహమాన్ పాటలు మాత్రం వాళ్లకు అస్సలు నచ్చలేదు. దీంతో తమ టికెట్ల డబ్బులు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేసారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎక్కువ మంది హిందీ మాట్లాడే ఆడియెన్స్ వచ్చిన ఆ కాన్సర్ట్‌లో రెహమాన్ మొత్తం తమిళ పాటలు పాడాడు. వింబ్లే స్టేడియంలో జరిగిన ఈ కాన్సర్ట్‌కు పేరు కూడా తమిళంలో’నేత్రు.. ఇండ్రు.. నాలాయ్’ అని పెట్టారు. కాన్సర్ట్ మొదలై సగం పాటలు పాడాడో లేదో.. సగం స్టేడియం ఖాళీ అయిపోయింది. అప్పుడప్పుడూ హిందీ పాటలు పాడుతూ.. చాలా వరకు తమిళంలోనే కాన్సర్ట్ సాగడంపై బాలీవుడ్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్టయ్యారు.
రెహమాన్ తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ, ఇంగ్లిష్, మాండరిన్, పర్షియన్, కన్నడలాంటి భాషల్లోనూ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాంటి రెహమాన్ ఈ కాన్సర్ట్‌లో కేవలం తన మాతృభాష తమిళానికి పరిమితమవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. హిందీలోనూ ఎన్నో అద్భుతమైన బాణీలు అందించిన ఘనత రెహమాన్‌కు ఉంది. అందులోనూ లండన్‌లో ఈ కాన్సర్ట్ ఇస్తున్నపుడు ఎక్కువగా హిందీ పాటలకు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి.. తమిళంలో పాడటం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దీంతో సగంలోనే బయటకు వచ్చేసి ఆర్గనైజర్స్‌పై తీవ్రంగా మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేశారని, తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు.