రెహ్మాన్ సంగీతాన్ని సినిమాల్లో విన్నారు. కచేరీలో ప్రత్యక్షంగా చూశారు.మరి సినిమాలో చూసే అరుదైన అనుభూతిని త్వరలోనే పొందబోతున్నారు. స్వయంగా సంగీత మాంత్రికుడు రెహ్మాన్ అలాంటి అవకాశాన్ని కల్పించడానికి సిద్ధమయ్యారు. ఈయన భారతదేశంలోనే కాకుండా పలు దేశాల్లో తన సంగీత విభావరు లతో అశేష సంగీత ప్రియులను ఆనందంలో ఓలలాడించారన్నది తెలిసిందే. అలా అమెరికాలో తన సంగీత పయనం సంచలన విజయం సాధించింది. అక్కడ 16 సంగీత కచేరీలను రెహ్మాన్ నిర్వహించారు. వాటన్నిటినీ కలిపి కన్సేర్ట్ జానర్లో ‘వన్హార్ట్’ పేరుతో చిత్రంగా రూపొందించారు.
ఇందులో రెహ్మాన్లో ఇప్పటి వరకు చూడని కోణాలను ప్రేక్షకులు చూడబోతున్నారు.రెహ్మాన్ సంగీతాన్ని ఎలా కంపోజ్ చేస్తారు. తన బృదంతో ఎలా రూపొందిస్తారు. ఈ వరుస క్రమం ఎలాగుండాలి? లాంటి అంశాలతో కూడిన చిత్రంగా ‘వన్హార్ట్’ ఉంటుంది. ఇదేవిధంగా గతంలో మైఖెల్ జాక్సన్ తన సంగీత కచేరీలతో ఒక చిత్రం రూపొంది సంచలన విజయం సాధించారు. ఇదే స్ఫూర్తితో రెహ్మన్ రూపొందించిన చిత్రం ‘వన్హార్ట్’. ఇటీవల ఈ చిత్ర ప్రీమియర్ షోను కెనడాలో ప్రదర్శించగా అపూర్వ ఆదరణతో పాటు ప్రశంసలు వెల్లువెత్తినట్లు రెహ్మాన్ బృదం తెలిపింది.
మరో విశేషం ఏమిటంటే… రెహ్మాన్ సంగీత కచేరీల చిత్రానికి డాల్బీ ఆటోమ్స్ సౌండ్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందట. చిత్రం చూసిన డాల్బీ సంస్థ సంతోషంతో ఈ చిత్ర ప్రచారం తామే చేస్తామని ముందు కొచ్చిందట. చిత్రాన్ని ఏఆర్ రెహ్మాన్ ప్రొఫెషనల్ బయోగ్రఫీగా భావించవచ్చు. ఇందులో కథానాయకులు, నాయికలు, ఇతర నటీనటులు అందరూ ప్రముఖ గాయకులే. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న తమిళం, ఆంగ్లం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.