ఏ.ఆర్. రెహ్మాన్ కొత్త అవతారం ఎత్తారు. తన వినసొంపైన సంగీతంతో ప్రపంచ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆయన రచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తూ ’99 సాంగ్స్’ అనే చిత్రాన్ని నిర్మించారు. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించగా, నూతన నటీనటులు ఇహాన్ భట్, ఎడిల్సే వర్గిస్ జంటగా నటించారు. మనీషా కొయిరాలా, లిసా రే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో సమ్మర్‌లో విడుదల చేయనున్నారు. ఈ చిత్ర సంగీతాన్ని విడుదల చేసిన సందర్భంగా రెహ్మాన్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు….
“ఏదైన ఓ సినిమాకి సంగీతం అందిస్తున్నప్పుడు మన ఆలోచనలను పంచుకోవడానికి అనుభవం ఉన్న దర్శకుడు, పాటల రచయిత, నిర్మాత తదితరులుంటారు. కానీ ఈ చిత్రానికి నేనే రచయితను. అంతేకాదు నిర్మాతని కూడా. నేను ఓకే అన్నా దర్శకుడికి నచ్చకపోవచ్చు. అందుకే మేం ప్రతి పాటకు మూడు, నాలుగు వెర్షన్లు రెడీ చేశాం. గత మూడు నెలలుగా మేం పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా చేయడం ఓ మంచి అనుభవం. ఈ చిత్రాన్ని అంబానికి చెందిన జియో స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నాం. నేను ఫలితం కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థినైతే, వాళ్ళు ఈ రంగంలో ఇప్పటికే నిరూపించుకున్నారు. వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగానే మేం నడుస్తున్నాం” అని అన్నారు.
బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘99 సాంగ్స్’
తొలి సినిమాయే అంతర్జాతీయ స్థాయి వేదికపై ప్రదర్శితమయ్యే అవకాశం వస్తే ఏ నిర్మాతకైనా ఆనందంగానే ఉంటుంది. ఆ హ్యాపీ ఫీలింగ్‌లోనే ఉన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ‘99 సాంగ్స్’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ ఒక నిర్మాతగా ఉన్నారు. అంతే కాదండోయ్ ఈ సినిమాకు రచయిత కూడా. ‘99 సాంగ్స్’ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.
24వ దక్షిణ కొరియాలో బూసాన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘99 సాంగ్స్’ ప్రదర్శితం అయ్యింది.‘‘99 సాంగ్స్’ చిత్రం బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం అయ్యిందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ చెప్పారు ఏఆర్ రెహమాన్. 85 దేశాల నుంచి వచ్చిన దాదాపు 299 సినిమాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అయ్యాయి. అక్కడ స్క్రీనింగ్ అయిన సినిమాలలో ‘ది స్కై ఈజ్ పింక్, ఆధార్’ వంటి హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి.