ఎన్బీకే ఫిల్స్మ్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంయుక్తంగా నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే …
బసవతారకం కోణంలో నుంచి ఈ కథ మొదలై… ఆ కోణంలోనే ఈ సాగుతుంది. బసవతారకం(విద్యాబాలన్) క్యాన్సర్‌తో బాధపడుతూ ఉంటుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి హరికృష్ణ(కల్యాణ్‌రామ్) తీవ్ర ఆందోళనకు గురవుతూ కనిపించడంతో సినిమా ప్రారంభమవుతుంది. చికిత్స తీసుకుంటున్న బసవతారకం ఎన్టీఆర్ ఆల్బమ్‌ను తిరగేస్తూ ఉండటంతో… యన్.టి.ఆర్. అసలు కథ మొదలవుతుంది. నందమూరి తారక రామారావు(బాలకృష్ణ) రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పనిచేస్తుంటాడు. అక్కడ లంచాలు తీసుకుని ప్రజలకు సేవ చేయడాన్ని సహించలేక మానేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. మద్రాస్ చేరుకుని ఎల్.వి.ప్రసాద్‌గారిని కలుస్తాడు. అక్కడి నుంచి ఆయన జీవితంలో సినిమా ఓ భాగంగా ఎలా మారింది. నటుడి నుంచి అగ్ర కథానాయకుడిగా ఎదిగే క్రమం…ఒక సాధారణ రైతు బిడ్డ గొప్ప స్టార్‌గా ఒక్కో అడుగు వేసుకుంటూ ఎలా వెళ్లాడన్నది కథ. ఎన్టీఆర్ ప్రస్థానంతో మొదలైన చిత్రం.. ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రకటనతో ముగుస్తుంది. తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్ సినీ జీవితం ఎలా సాగిందో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే!
విశ్లేషణ …
భర్త ఆశయానికి తన ఆమోదముద్రతో ఊపిరిలూదిన భార్య బసవతారకం. అన్నకు తోడుగా ఆసాంతం ఆయనతోనే ఉన్న తమ్ముడు త్రివిక్రమరావు.యువ రక్తానికి, దూడుకు తనానికి ప్రతీకగా కనిపించిన హరికృష్ణ, ఎన్టీఆర్ జీవితంలో ఎంతో కీలక పాత్ర వహించిన ఎల్వీ ప్రసాద్, కె.వి.రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, అప్పట్లో తారలు సెట్లో ముచ్చటించుకునే విషయాలు, ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య అనుబంధం, తిరుపతికి వెళ్లిన తెలుగువారు మద్రాసు వెళ్లి ఎన్టీఆర్‌ను కలవడం, తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ తరలి రావడం గురించి ఎన్టీఆర్, ఏఎన్నార్ ఏమనుకున్నారు? ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎందుకు రావాలని అనుకున్నాడు.. అందుకు ప్రేరేపించిన అంశాలు ఏంటి? కథానాయకుడి జీవితం నుంచి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదగాలనుకున్నాడది ప్రీక్లైమాక్స్‌లో కనిపిస్తుంది. దివిసీమ ఉప్పెన నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. అభిమానులకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అత్యంత నాటకీయంగానూ, సహజంగానూ దర్శకుడు తెరపైకి తీసుకొచ్చాడు.
సాంకేతికంగా…
సినిమా నేపధ్యమే కాకుండా ఎన్టీఆర్ కుటుంబాన్ని …అన్నిటినీ బ్యాలన్స్ చేస్తూ సినిమాను తీసిన ఘనత క్రిష్‌కి దక్కుతుంది. `మనదేశం` నుంచి `వేటగాడు` వరకు ఆయన చేసిన ఎన్నో సినిమాల్లోని సన్నివేశాలను ఇందులో పెట్టారు. అందుకు తగ్గ కాస్ట్యూమ్స్, ఆ పాత్రల మేకప్, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడం …సందర్భోచితంగా పాటలు, ప్రతి సన్నివేశంలోనూ మెప్పించే డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. ప్రతి పాత్రకు ఒక ఔచిత్యం ఉంది. దానికి తగిన నటీనటులను ఎంచుకునే విషయంలో దర్శకుడు క్రిష్, అతని బృందం విజయం సాధించింది.నటీనటులు ఒక్క సన్నివేశంలో కనిపించినప్పటికీ, ఆ పాత్రల ప్రభావం ప్రేక్షకుల మీద కనిపిస్తుంది. ఎం.ఎం. కీరవాణి అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రతి ఫ్రేమూ చాలా అందంగా చూపించారు. అన్నింటికన్నా బుర్రా సాయిమాధవ్ రాసిన సంభాషణలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రతి సన్నివేశంలో ఒక చురుకైన సంభాషణ ఉంటుంది.మేకప్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ను కూడా ప్రత్యేకంగా అభినందించాలి.
నటీనట వర్గం…
ఎన్టీఆర్‌గా బాలకృష్ణ.. ఎన్నో విభిన్న గెటప్పుల్లో కనిపించి అలరించారు . ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి పాత్రల్లో బాలకృష్ణని చూడటం అభిమానులకు నిజంగా పండగలా ఉంటుంది. ఎన్టీఆర్ యువకుడిగా ఉన్న సమయంలో బాలకృష్ణ కనిపించిన సన్నివేశాలు బాలకృష్ణ వయసు రీత్యా అంతబాగా రాలేదేమో అనిపిస్తుంది. బసవతారకంగా విద్యాబాలన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఆమెను ఎంచుకోవడమే ఈ సినిమాకు ప్రధాన బలం. కొన్ని సన్నివేశాల్లో విద్యాబాలన్‌ని చూస్తుంటే అచ్చు బసవతారకం ఇలాగే ఉండేవారేమోననిపించింది.ఈ పాత్ర తర్వాత అభిమానులను ఎక్కువగా ఆకట్టుకునేది అక్కినేని నాగేశ్వరరావు పాత్ర. అక్కినేనిగా సుమంత్ చాలా చక్కగా కనిపించారు. ఎన్టీఆర్-ఏయన్నార్ల అనుబంధాన్ని తెరపై అందంగా ఆవిష్కరించారు. మరో ముఖ్యమైన పాత్ర త్రివిక్రమరావు. ఆ పాత్రలో దగ్గుబాటి రాజా చక్కగా నటించారు. చంద్రబాబుగా రానా పాత్ర చివరిలో కనిపిస్తుంది – రాజేష్