‘సూపర్‌స్టార్’ రజినీకాంత్… ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో, రజినీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తారా లేదా? అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే… మరో వైపు ఆయన కొత్త సినిమాలవైపు మొగ్గు చూపుతున్నట్టు వినిపిస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. విజయ్, అజిత్ ఇద్దరూ టాప్ హీరోలు అయినప్పటికీ, సినిమా కలక్షన్ల విషయంలో వీళ్లు ఇప్పటికీ రజినీకాంత్‌ను బీట్ చెయ్యలేకపోతున్నారు. సూపర్‌స్టార్ సినిమాల నుంచి పక్కకు తప్పుకున్నప్పుడే వీళ్లలో ఒకరు ఆ హోదాను దక్కించుకునే అవకాశం ఉంది. కానీ రజనీకాంత్ ఇప్పుడే వాళ్లకు ఆ అవకాశాన్ని ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం ఐదు సినిమాల్లో ఆయన నటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
‘పేట్ట’ తర్వాత రజినీకాంత్ 166వ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్, 167వ చిత్రాన్ని సురేష్‌కృష్ణ, 168వ చిత్రాన్ని కేఎస్ రవికుమార్, 169వ చిత్రాన్ని కార్తిక్సుబ్బరాజ్, 170వ చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చెయ్యబోతున్నారు. ఆ తర్వాత ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని సమాచారం. ఈ సినిమాలు పూర్తయిన తర్వాతే ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వస్తారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ప్రకారం ఏడాదికి రెండు సినిమాల వంతున రజనీకాంత్ ఈ ఐదు చిత్రాలు పూర్తి చెయ్యడానికి మూడేళ్లు పడుతుంది. అంటే 2021లో ఆ సినిమాలు పూర్తవుతాయి. అంటే ఆ సంవత్సరంలో జరిగే శాసనసభ ఎన్నికలప్పుడే ఆయన రాజకీయాల్లో అడుగుపెడతారేమో. రజనీ ఐదు చిత్రాల్లో నటించనున్నారనే ‘చేదు వార్త’ అజిత్, విజయ్ అభిమానులను తీవ్ర నిరాశపరుస్తోంది. ఇదిలా ఉండగా 1975లో సినీరంగంలో అడుగుపెట్టిన రజినీకాంత్ 2025 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటారు.