ప్రేక్షకులను పడగొట్టలేని… ‘బ్లఫ్ మాస్టర్’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.5/5 

అభిషేక్ ఫిలింస్‌, శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ల పై గోపీ గ‌ణేష్ ప‌ట్టాబి దర్శకత్వం లో ర‌మేశ్ పిళ్లై ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే…
సింగ‌రాయ‌కొండ‌లో ధ‌న‌శెట్టి(పృథ్వి)ని ఓ ర‌కంగా.. వైజాగ్‌లో గోల్డ్ వే మిడాస్ ట‌చ్ అనే చైన్ లింక్ కంపెనీని మ‌రో ర‌కంగా మోసం చేస్తాడు ఉత్తమ్ కుమార్(స‌త్య‌దేవ్‌). వైజాగ్‌లో ఉత్త‌మ్‌కి అవ‌ని(నందితా శ్వేత‌) ప‌రిచ‌యం అవుతుంది. ఉత్త‌మ్ మంచివాడు అనుకుని అవ‌ని అత‌న్ని ప్రేమిస్తుంది కూడా. అయితే త‌ను ప్ర‌జ‌ల‌ను మోసం చేసి డ‌బ్బులు సంపాదిస్తున్నాన‌నే నిజం ఆమెకు చెప్పిన ఉత్త‌మ్ వైజాగ్ నుండి వెళ్లిపోతాడు. అలా ఉత్త‌మ్ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని ప‌లు పేర్ల‌తో, వేషాల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేసి డ‌బ్బులు సంపాదిస్తుంటాడు. అయితే క‌ళింగ‌ప‌ట్నంలో పోలీస‌ులు అత‌న్ని అరెస్ట్ చేస్తారు. పోలీసులు ఎంత కొట్టినా డ‌బ్బులు ఎక్క‌డ దాచింది పోలీసుల‌కు చెప్ప‌డు. అదే డ‌బ్బుల‌ను ఉప‌యోగించుకుని కోర్టు, పోలీసుల నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. అయితే డ‌బ్బులుంటే ఎదుటి వ్య‌క్తి ప్రాణం తీయ‌డానికి కూడా వెనుకాడ‌ని మ‌రో వ్య‌క్తి( ఆదిత్య మీన‌న్‌) ఉత్త‌మ్‌కుమార్ జీవితంలోకి ప్ర‌వేశిస్తాడు. అత‌న్నుండి త‌ప్పించుకోవ‌డానికి తెలివిగా అత‌న్ని, అత‌ని గ్యాంగ్‌ను పోలీసుల‌కు ప‌ట్టిస్తాడు. అయితే త‌ను చేసిన మోసాల కార‌ణంగా ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితిలో త‌ప్పించుకుని తిరుగుతుంటాడు. ఆ స‌మ‌యంలో ఉత్త‌మ్‌ను అవ‌ని ర‌క్షించి త‌నుండే అనాథాశ్ర‌మానికి తీసుకెళుతుంది. ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకున్న ఉత్త‌మ్ మంచివాడుగా బ్ర‌త‌కాల‌నే నిర్ణ‌యం తీసుకుంటాడు. అవ‌నిని పెళ్లి చేసుకుని చిక్ మంగ‌ళూర్ వెళ్లిపోతాడు. ఉత్త‌మ్‌ ఆదిత్య మీన‌న్ బారి నుండి ఎలా త‌ప్పించుకున్నాడు? ఎలాంటి గ‌మ్యం చేరుకున్నాడ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి…
విశ్లేషణ…
కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిన`చ‌దురంగ‌వేట్టై` సినిమాకు రీమేక్‌గా ‘బ్లఫ్ మాస్టర్‌’ వచ్చింది.`చ‌దురంగ‌వేట్టై` జనాన్ని మోసం చేసి జీవనం సాగించే ఒక మోసగాడి కథ .త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆ స్థాయిలో మలచలేకపోయారు. లవ్ స్టోరీని ..మెయిన్ గా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ విషయంలో  శ్రద్ద తీసుకుని ఉండి ఉంటే బాగుండేది. దీంతో పాటు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత బాగా ఎక్కువుగా ఉంది.
 
హీరోలోని పరివర్తనకి కారణమైన హీరోయిన్‌ ట్రాక్‌ మరీ అసహజంగా వుంది. ఆమె ఎందుకని అతడికి మనసిస్తుందో.. అతనెందుకు మారిపోతాడో.. అనే వాటికి బలమైన కారణాలు చూపలేదు. హీరో అంద‌రినీ మోసం చేసే సన్నివేశాలు బావున్నాయి. అయితే పాతకాలపు మోసాలను వదిలేసి.. కొత్త తరహా మోసాలు చూపిస్తే బాగుండేది.ప్రథమార్ధం సాఫీగా సాగిపోయినా.. ద్వితీయార్ధం మాత్రం బాగా బోర్ కొట్టించారు.చాలా సాదా సీదాగా సినిమా నడిచింది.  చివర్లో సన్నివేశాలైనా ఆకట్టుకునేలావుంటే కొంత బాగుండేది. కానీ.. త్వరగా ముగించేస్తే బాగుంటుందని అనిపిస్తుందే తప్ప ఆసక్తి రేకెత్తించలేకపోయింది.
 
నటీనటులు…
‘బ్లఫ్ మాస్టర్’గా కనిపించిన సత్యదేవ్ చక్కని నటనను కనబరిచాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.హీరోయిన్ తో సాగే ప్రేమ సన్నివేశాల్లో కూడా సత్యదేవ్ తన నటనతో ఆకట్టుకుంటాడు.అవని అనే అమ్మాయి పాత్రలో నటించిన హీరోయిన్ నందిత శ్వేత తన నటనతో పాటుగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే కొన్నిచోట్ల అవసరానికి మించిన హావభావాలతో చాలా అతిగా చేసింది. విల‌న్ పాత్ర‌లో న‌టించిన ఆదిత్య‌మీన‌న్, పృథ్వి, బ్ర‌హ్మాజీ, సిజ్జు, చైత‌న్య‌కృష్ణ, ధ‌న‌రాజ్ త‌దిత‌రులు పాత్రల మేర చ‌క్క‌గా న‌టించారు.
 
సాంకేతికంగా…
సంభాషణలు  బాగున్నాయి.. సినిమాలో హైలైట్ అయ్యాయి. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో  నేపధ్య సంగీతం మాత్రం కొంతమేరకు ఆకట్టుకుంటుంది.దాశరథి శివేంద్ర కెమెరా ప‌నితనం .. నవీన్‌ నూలి ఎడిటింగ్ బాగున్నాయి.నిర్మాణ విలువలు అంతంత మాత్రమే -రాజేష్