ఝాన్సీరాణి పాత్ర ఏంటి, నేను నటించడమేంటి? ఇదంతా ఒక ఊహలా ఉంది అనుకుంటా! నేను ఉన్నా.. లేకపోయినా భారతీయ మహిళగా నాకు గుర్తింపు ఉంటే చాలని ఈ సినిమా చేశాక అనిపించింది. అదంతా ఝాన్సీరాణీ గొప్పతనమే. ఇందులో నేను పోషించిన పాత్రను బట్టి సినిమాకు హీరోయిన్లా కాకుండా ఓ హీరోలా చూస్తున్నారు….అని అంటోంది ‘మణికర్ణిక’ నాయిక కంగనారనౌత్.
‘మణికర్ణిక’ ఓ చారిత్రక చిత్రం. భారతదేశ వీరనారి ఝాన్సీరాణి కథ … భారీ ప్రాజెక్ట్ కాబట్టి అందరం శారీరకంగా, మానసికంగా ఎక్కువ కష్టపడ్డాం. హైదరాబాద్, జోధ్పూర్లలో షూటింగ్ చేసినప్పుడు మూడు, నాలుగుసార్లు గాయాలపాలయ్యాను. ఓ సారి కాలికి ఫ్రాక్చర్ అయింది. కాస్త రెస్ట్ తీసుకుని మళ్లీ సెట్లోకి వెళ్లిపోయేదాన్ని.వీరవనిత సినిమా కావడంతో తెలియకుండానే నాలో స్ఫూర్తి పెరిగేది. రోజుకి నలభై నిమిషాలు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక్కో యాక్షన్ సీన్ చెయ్యడానికి 9 నుంచి 10 గంటల సమయం పట్టేది. షూటింగ్ సమయంలో బలమైన ఆహారం తీసుకునేదాన్ని. దేశీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు బాగా తినేదాన్ని. ఆ ఆహారమే ఎన్నో గాయాల్ని తట్టుకునేలా చేసిందని నమ్ముతా. దర్శకుడు క్రిష్ ‘యన్.టి.ఆర్’ సినిమాతో బిజీ కావడంతో సినిమాలో కొంత భాగం నేను డైరెక్ట్ చెయ్యాల్సి వచ్చింది. డైరెక్షన్ చెయ్యగలననే నమ్మకం నాకున్నా నాతో ఉన్నవారి మాటల వల్ల నేను సాధించగలనా, లేదా? అన్న అనుమానం కలిగింది. అయినా అధైర్యపడలేదు. చిత్రీకరణ దశలో ఎంత నెగిటివ్ ఉందో ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా పాజిటివ్ అయింది. ‘మణికర్ణిక’ కొంత భాగం డైరెక్ట్ చేయడంతో కొంత అవగాహన వచ్చింది. భవిష్యత్తులో కూడా దర్శకత్వం చెయ్యాలని ఉంది.