‘మూవీ ఆర్టిస్టుల సంఘం’ (మా) డైరీ…ని సోమవారం హైదరాబాద్ అపోలో ఆడిటోరియంలో ఆవిష్కరించారు. సూపర్‌స్టార్ కృష్ణ `మా సిల్వర్ జూబ్లీ డైరీ-2019` తొలి ప్రతిని ఆవిష్కరించి కృష్ణంరాజు కు అందించారు. సూపర్‌స్టార్ కృష్ణ – విజయనిర్మల, రెబల్‌స్టార్ కృష్ణంరాజు- శ్యామలా దేవి దంపతులు సంయుక్తంగా `మా సిల్వర్ జూబ్లీ డైరీ-2019` ఈబుక్‌ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలోనే మూవీ ఆర్టిస్టుల సంఘం పేద కళాకారుల ఇంట ఆడ పిల్లల పెళ్లికి `కళ్యాణ లక్ష్మి` పథకం పేరుతో సాయాన్ని ప్రకటించింది. కళ్యాణలక్ష్మి పథకానికి తమ వంతు సాయమందిస్తామని శ్రీమతి విజయనిర్మల, శ్రీమతి శ్యామలా దేవి ప్రకటించారు. విజయనిర్మల రూ.1.5లక్షలు, శ్యామలాదేవి రూ.1 విరాళం `కళ్యాణ లక్ష్మి`కి ప్రకటించారు. జనవరి నుంచి కళాకారుల్లో పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1లక్ష 16వేల సాయం అందిస్తామని శివాజీ రాజా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకం స్ఫూర్తితో పేద ఆర్టిస్టుల కోసం `కళ్యాణ లక్ష్మి` ప్రారంభమైందని తెలిపారు. అలాగే మా డైరీ స్పాన్సర్స్ అపోలో రూ 14.10 లక్షలు స్పాన్సర్ చేశారని `మా` ప్రధాన కార్యదర్శి నరేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు ‘సూపర్‌స్టార్’ కృష్ణ మాట్లాడుతూ- “ప్రతిష్ఠాత్మక మా డైరీ ఆవిష్కరణకు ఆహ్వానించిన అధ్యక్షకార్యదర్శులు శివాజీరాజా, నరేష్ బృందానికి కృతజ్ఞతలు. మా సొంత భవంతి నిర్మాణం జరగాలి. మా ఇంకా ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలి. శుభాభివందనాలు“ అన్నారు. మేటి దర్శకురాలు, శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ-“మా డైరీ ఆవిష్కరణ ఓ చిన్న పెళ్లి జరిగినట్టు కన్నుల పండుగలా జరిగింది. చాలా కాలం తర్వాత ఇలాంటి మంచి వేడుకకు వచ్చాను. కొత్త సంవత్సరంలో మా మరిన్ని మంచి పనులు చేయాలి“ అన్నారు.
‘రెబల్‌స్టార్’ కృష్ణంరాజు మాట్లాడుతూ –“కృష్ణ-కృష్ణం రాజు పరిశ్రమకు ఆరంభంలో మూల స్థంబాలుగా నిలిచినవారు. చిన్న పరిశ్రమను ఇంతగా ఎదగడంలో మా పాత్ర ఉంది. డబ్బు లేకపోతే నిర్మాతలకు డబ్బు ఇచ్చి సినిమాలు తీశారు కృష్ణ. తిండికి లేని చోట మేం భోజనాలు పెట్టిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత ఎందరో సినిమాలు తీసి లాభపడ్డారు. ఎదిగారు. పరిశ్రమను పెద్దది చేశారు. గొడవలు, సమస్యలు ఉన్నా అప్పట్లో పరిష్కరించాం. కమిటీలు వేసి సమస్యలు పరిష్కరించాం. వర్గవిభేధాలు లేకుండా కలిపి ఉంచగలిగాం. ఇకపైనా అలానే నడవాలి. మా అసోసియేషన్‌కి సొంత బిల్డింగ్ కట్టాలి. మా వంతు సహకారం ఉంటుంది“ అన్నారు. శ్రీమతి శ్యామల కృష్ణంరాజు మాట్లాడుతూ-“సూపర్‌స్టార్ కృష్ణ- విజయనిర్మల అంతటివారు ఉన్న వేదికపై సన్మానం అందుకోవడం గౌరవంగా ఉంది. లేడీ దర్శకుల్లో విజయనిర్మల గారు డైనమిక్. ఆదర్శ ం. మా సంఘం మరింతగా అభివృద్ధి చెందాలి“ అన్నారు.
‘మూవీ ఆర్టిస్టుల సంఘం’ అధ్యక్షులు శివాజీ రాజా మాట్లాడుతూ-“33 మంది పేద కళాకారులకు రూ.3000 చొప్పున ఫించను ఇస్తున్నాం. ఈ జనవరి నుంచి రూ.5000 చొప్పున ఫించను ఇవ్వాలని నిర్ణయించాం. రూ.1000 ఫించనుతో మొదలై, ఇప్పటికి ఇంత పెద్ద సాయం అందుతోంది. అలాగే `మా- కళ్యాణ లక్ష్మి సాయం 1,16,000 చొప్పున కళాకారుల్లో పేద వారైన అర్హులకు అందజేస్తాం. `మా – విద్య` పేరుతో పేద కళాకారుల పిల్లలకు రూ.100000 అందజేస్తాం. జనవరి 1 నుంచే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. లండన్‌లో `మా` సంఘం తరపున భారీగా ఓ ఈవెంట్‌ని నిర్వహించనున్నాం.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలకు కృతజ్ఞతలు. మూవీ ఆర్టిస్టుల సంఘం తరపున పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం“ అన్నారు.
`మా` ప్రధాన కార్యదర్శి సీనియర్ నరేష్ మాట్లాడుతూ –“ప్రతియేటా ఈ కార్యక్రమం బాగా జరుగుతోంది. అపోలో స్పాన్సర్షిప్ తరపున రూ.14.10 లక్షల సాయం అందింది. కళ్యాణ లక్ష్మికి 1.16లక్షల చొప్పున అందజేయనున్నాం. అలాగే అమ్మ విజయనిర్మల గారు తన ప్రతి బర్త్‌డేకి అన్ని వేల చొప్పున మా అసోసియేషన్‌కి అందిస్తున్నారు. ఇప్పటికి రూ.15వేల చొప్పున పంపుతున్నారు. ఇదివరకూ లక్షల్లో డొనేషన్లు ప్రకటించారు“ అని తెలిపారు.
‘మా’ కమిటీ సభ్యులు బెనర్జీ మాట్లాడుతూ- పేద ఆడపిల్లల సాయానికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించాలన్న ఆలోచన శివాజీరాజాదే. ఒక మంచి ఐడియాని అందరూ ఆదరిస్తారు. ప్రోత్సహిస్తారు. మా సొంత భవంతి నిర్మాణానికి నిధులు సేకరిస్తున్నాం. వచ్చే ఏడాది కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం“ అన్నారు. మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షులు శివాజీ రాజా, సహజనటి జయసుధ, జనరల్ సెక్రటరీ నరేష్, అపోలో జేఎండీ డా.సంగీతా రెడ్డి, హేమ, నాగినీడు, సురేష్ కొండేటి, హీరోయిన్ సంజన, మా కమిటీ సభ్యులు, నటీనటులు కార్యక్రమంలో పాల్గొన్నారు.