చాలా కాలం గా సాగుతున్న పైరసీ దారుల ఆగడాలకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు పోలీసులు. దేశంలో ఏ భాషా చిత్రాలనైనా పైరసీ వణికించేస్తోంది. పైరసీకి భాషా భేదం, ప్రాంతీయ భేదం లేదు. ఉగ్రవాదంలా పైరసీ కూడా ఓ మహమ్మారిలా తయారైంది. కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే… ఆ సినిమా రిలీజ్ కాకుండానే పైరసీ కోరల్లో చిక్కుకుంటోంది. థియేటర్లలో కంటే ముందే ఇంటర్ నెట్ లో ప్రింట్ వచ్చేస్తోంది. ముఖ్యంగా ‘తమిళ రాకర్స్’, ‘తమిళ బాక్స్’ అనే సంస్థలు సినిమా రిలీజైన రోజే పైరసీని మార్కెట్లోకి తీసుకొచ్చి నిర్మాతల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి.
పైరసీ భూతాన్ని అరికట్టేందుకు చిత్రపరిశ్రమ ఎన్నో రకాల ఆలోచనలు చేస్తుంది. అయితే దశాబ్దంగా సాగుతున్న పైరసీ దారుల ఆగడాలకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు పోలీసులు. తాజాగా ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ‘జీరో’ చిత్రం కూడా పైరసీ బారిన పడింది. తొలి రోజే ‘తమిళ రాకర్స్’ సంస్థ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్లైన్లో ఉంచింది. దీంతో ‘జీరో’ సినిమాకి బిజినెస్ భారీగా తగ్గుతుందనే టాక్ వినిపిస్తోంది. ‘జీరో’ చిత్రంపై అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండగా, ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ‘జీరో’పై పైరసీ ప్రభావం తప్పక ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘జీరో’ చిత్రంలో షారుఖ్ మరుగుజ్జుగా కనిపించగా, అనుష్క దివ్యాంగురాలిగా దర్శనమిచ్చింది. ఇక కత్రినా సూపర్ స్టార్ పాత్రలో అలరించింది.