అభినందనీయ స్పేస్‌ థ్రిల్లర్‌… ‘అంతరిక్షం’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 3/5 

ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ పతాకం పై స‌ంక‌ల్ప్ రెడ్డి దర్శకత్వంలో రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే…
వరుణ్ తేజ్(దేవ్) ఐదు సంవత్సరాల క్రితం చంద్రుని పై విప్రయాన్ శాటిలైట్ ను పంపే ప్రాసెస్ లో అనుకోకుండా వచ్చే కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి)ని కోల్పోవడంతో పాటు, తన విప్రయాన్ మిషన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఓ మిషన్ ను పూర్తి చెయ్యడానికి వరుణ్ దేవ్ (వరుణ్ తేజ్) అవసరం ఏర్పడుతుంది.ఆ మిషన్ ను పూర్తి చేసే క్రమంలో దేవ్ కి కొన్ని సమస్యలను ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎదుర్కొని దేవ్ వాటిని ఎలా పరిష్కరించాడు ? అలాగే తన విప్రయాన్ మిషన్ ని ఎలా పూర్తి చేశాడు ? రెండు మిషన్ లను దేవ్ తన బృందంతో ఎలా విజయవంతంగా పూర్తి చెయ్యగలిగాడు ? అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే….
విశ్లేషణ…
ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి రెండో ప్రయత్నంగా తొలి తెలుగు స్పేస్‌ మూవీ అంతరిక్షంను తెరకెక్కించాడు.ఆది నుండి టెంపోను క్యారీ చేయించాడు. ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌కు హ్యాట్పాఫ్ చెప్పాల్సిందే. తక్కువ బ‌డ్జెట్‌లో హాలీవుడ్ ఆలోచ‌నా స్థాయి మూవీ చేయ‌డం గొప్ప విష‌యం. కొత్త అటెంప్ట్ చేసిన నిర్మాతలను, ద‌ర్శ‌కుడి టేకింగ్‌, గ్రాఫిక్స్‌, నిర్మాణ విలువ‌ల‌ను అభినందించాలి. ఇలాంటి సినిమాల్లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కామెడీ స‌న్నివేశాల‌ను ఆశించడం కుదరదు. ఫస్ట్ హాఫ్‌లో లవ్‌ స్టోరి కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. సెకండ్‌ హాఫ్ అంతా అంతరిక్షంలోనే నడుస్తూ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేస్తుంది. గ్రిప్పింగ్ గా సినిమా ర‌న్ అవుతుంది. సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రెండు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అంతరిక్షం బ్యాక్ డ్రాప్లో ఈ ‘అంతరిక్షం’ తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతినిస్తుంది.
నటీ నటులు…
వరుణ్ తేజ్‌ ఈ సినిమాలో టెంపర్‌ కంట్రోల్‌ లేని సైంటిస్ట్‌గా, ప్రేమికుడిగా, స్పేస్‌లో సాహసాలు చేసే వ్యోమగామిగా అద్భుతంగా నటించాడు. దేవ్ పాత్ర‌లో వ‌రుణ్‌తేజ్ చ‌క్క‌గా ఒదిగిపోయాడు. రియా పాత్రలో అదితిరావ్‌ హైదరి చాలా బాగా కనిపించింది.  లేడీ అస్ట్రనాయిడ్ గా, దేవ్‌ను గోల్ వైపు మ‌ళ్లించే పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించింది. లుక్స్‌ తో పాటు నటన పరంగానూ మంచి మార్కులు సాధించింది. లావణ్య త్రిపాఠిది దాదాపు అతిథి పాత్రే. ఉన్నంతలో అందంతో అభినయంతో ఆకట్టుకుంది. స‌త్య‌దేవ్ డ్యూయెల్ రోల్‌లో న‌టించాడు. అవ‌స‌రాల శ్రీనివాస్ పాత్ర ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్‌లో చేసాడు. ఇతర పాత్రల్లో రాజా, రెహమాన్‌  ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు…
జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీతో సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాడు.  రాజీవ్ రాజ‌శేఖ‌రన్ గ్రాఫిక్స్ చాలా బాగా చేశాడు. కిట్టు మంచి డైలాగ్స్ రాశాడు. ప్రశాంత్ విహారి సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. పాట‌లు క‌థానుగుణంగా ఉన్నాయి. కార్తిక్ శ్రీ‌నివాస్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -రాజేష్