అందరికీ కావాలంట ఈ ‘బంగారుకొండ’ !

‘యంగ్ స్టార్’ విజయ్ దేవరకొండ… సూపర్‌స్టార్ హీరోలతో స్టార్ డైరెక్టర్లు బిజీగా ఉండడంతో పలువురు మీడియం రేంజ్ డైరెక్టర్లు యంగ్ స్టార్ విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చూస్తున్నారు. యూత్ ఐకాన్‌గా పేరొందిన విజయ్‌తో సినిమా చేసి హిట్ కొట్టడం చాలా సులభమని దర్శకులు భావిస్తున్నారు. అందుకే అతని కోసం క్యూ కడుతూ ఎలాగైనా ఓకే అనిపించుకోవాలని చూస్తున్నారు. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ ఇంతవరకు ఏ కొత్త సినిమాకు ఓకే చెప్పలేదు. దాదాపు అర డజను మంది నిర్మాతలతో అతనికి ఒప్పందాలున్నాయి. విజయ్ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేస్తున్నారు. ఇక ఈ యంగ్‌స్టార్‌ను మెప్పించడానికి దర్శకులు మారుతి, గోపీచంద్ మలినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అలాగే పూరి జగన్నాథ్ కూడా తనదైన శైలిలో ఒక ‘పోకిరి’లాంటి క్యారెక్టరైజేషన్‌తో విజయ్‌తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారట. కానీ ఈ యంగ్‌స్టార్ ఏ దర్శకుడికి కూడా పూర్వ వైభవం లేదా సక్సెస్ చూసి డేట్స్ ఇవ్వడం లేదు. తన మార్కెట్ ఏమిటో విజయ్‌కు బాగా తెలుసు కనుక సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రస్తుతం విజయ్‌దేవరకొండకు భారీ డిమాండ్ ఉండడం విశేషం.
 
రామ్ చరణ్ తో సమానమైన స్థానం
టాలీవుడ్‌లో రోజురోజుకూ విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో తాజాగా ఓ విషయంలో చెర్రీతో సమానమై సంచలనం సృష్టించాడు. కెరీర్ మొదట్లోనే ఇలా స్టార్ హీరోతో సమానం కావటం ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తోంది. ఇక అసలు విషయంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరంలో అత్యధికంగా సంపాదించిన 100 మంది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలవగా.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఇద్దరూ 72వ స్థానంలో నిలిచారు.
2018లో 14 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందిన సెలెబ్రిటీలుగా ఈ ఇద్దరూ ఫోర్బ్స్ జాబితాలో సమానమైన స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ‘రంగస్థలం’ సినిమాతో చెర్రీ బ్లాక్‌బస్టర్ సాధించగా.. ‘‘గీత గోవిందం, టాక్సీవాలా’’ చిత్రాలతో విజయ్ దేవరకొండ అలరించాడు. అయితే కెరీర్ ప్రారంభంలోనే.. ఇలా చెర్రీతో సమానమైన స్థానంలో నిలవటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది చూసి ముందు ముందు విజయ్ దేవరకొండ మరింత జోష్‌తో దూసుకెళ్ళటం ఖాయం అని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.