‘మ్యూజిక్ మేస్ట్రో’ ఇళయ రాజా… ‘నా పాటలు పాడుతూ, మీరు(గాయకులు) సొమ్ము చేసుకోవడం సరైనదికాదు. పాటల ద్వారా నాకు రావాల్సిన రాయల్టీని ఇవ్వా ల్సిందే’ అని అంటున్నారు ఇళయ రాజా. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇళయరాజా సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. కొన్ని వేల పాటలను ఆయన కంపోజ్ చేయడం తోపాటు, పాడారు. అందు లో శ్రోతలను మదిని దోచిన పాటలు కూడా వేలల్లో ఉంటాయి. అయితే ఇటీవల కొందరు గాయకులు వివిధ కార్యక్రమాల్లో ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలు పాడుతున్నారు. ఈ నేపథ్యంలో వీటిపై తాజాగా ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో దీనిపై ఓ పోస్ట్ పెట్టారు. ‘నా పర్మిషన్ లేకుండా నేను కంపోజ్ చేసిన పాటలను పాడుతున్న గాయకులందరికీ నా విన్నపం. నా పాటలు పాడొద్దని నేను చెప్పడం లేదు. కానీ పాడే ముందు నా అనుమతి తీసుకోండి. నిబంధనలను పాటించండి. నా అనుమతి తీసుకోకుండా పాటలు పాడటం నేరం. దీనిపై సింగర్స్తోపాటు బ్యాండ్ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
నేను ‘ఐపీఆర్ఎస్'(ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ)లో సభ్యుడిని కాను. కానీ నా పాటలు పాడుతున్నందుకు రావాల్సిన రాయల్టీ ఫీజ్ను ఐపీఆర్ఎస్ వసూలు చేస్తుంది. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. ఆ ఫీజు ‘దక్షిణ సినిమా సంగీత కళాకారుల సంఘం’ సేకరిస్తుంది. దీన్ని అంతా గుర్తుంచుకోవాలి. మీరంతా పాటలు పాడటానికి డబ్బులు తీసుకుంటున్నారు, ఉచితంగా పాడటం లేదు. నా పాటలు పాడుతూ, మీరు డబ్బులు తీసుకోవడం సరైనదేనా? నాకు రావాల్సిన వాటా గురించి ఏంటీ? నేనడుగుతున్న డబ్బు మున్ముందు తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని ఇళయరాజా పేర్కొన్నారు. ప్రస్తుతం అరడజనుకుపైగా చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్నారు.
ఇళయరాజా తన పాటలని అనుమతి లేకుండా పాడొద్దంటూ గతంలో బాల సుబ్రహ్మాణ్యంకి ఇళయరాజా నోటోసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.