మెసేజ్ తో విజువల్ మేజిక్… ‘2.0’ చిత్ర సమీక్ష

                                          సినీవినోదం రేటింగ్ : 3/5 

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై ఎస్‌.శంక‌ర్‌ దర్శకత్వంలో సుభాస్క‌ర‌న్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
కధలోకి వెళ్తే …
చెన్నైలో ఉన్నట్టు ఉండి సడెన్ గా ప్రజల సెల్ ఫోన్స్ గాలిలోకి వెళ్ళిపోయి మాయమవుతూ ఉంటాయి. అసలా ఫోన్స్ ఎలా మయమవుతున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో పోలీసులకు, ప్రజలకు ఏం అర్ధం కాదు. దాంతో ఆ ఫోన్స్ గురించి తెలుసుకోవడానికి సైంటిస్ట్ వశీకరన్ (రజినీ కాంత్ ) తన టెక్నాలజీని ఉపయోగించి.. చివరకి ఆ సెల్ ఫోన్స్ ను ఓ నెగిటివ్ ఫోర్స్ మాయం చేస్తుంది అని తెలుసుకుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆ సెల్ ఫోన్స్ అన్ని కలిసి ఒక పక్షి ఆకారంలో మారి అతి దారుణంగా జనాన్ని చంపుతుంది. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి తప్పని పరిస్థితుల్లో  ‘చిట్టి’ ని రీ లాంచ్ చెయ్యటానికి సైంటిస్ట్ వశీకరన్ కి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. రీ లాంచ్ అయిన చిట్టి ఆ నెగిటివ్ ఫోర్స్ ని అంతం చెయ్యడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? చివరకి అంతం చేశాడా లేడా ? ఈ క్రమంలో చిట్టి 2.ఓ గా రీ లోడ్ ఎలా చెయ్యబడతాడు ? అసలు ఆ నెగిటివ్ ఫోర్స్ కు సెల్ ఫోన్స్ కు ఉన్న సంబంధం ఏమిటి ? దీని వెనకాల ఉన్న కథ ఏమిటి ? చిట్టి 2.ఓ ఈ పరిస్థితి ని ఎలా అదుపులోకి తీసుకువస్తాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ…
‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ ‘రోబో’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్ర‌మిది. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్‌ని విల‌న్‌గా పెట్టి.. ఇండియ‌న్ సినిమాల్లో ఇంత వ‌ర‌కు ఏ సినిమాకు పెట్ట‌ని భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను తెర‌కెక్కించారు.సాంకేతికత వల్ల వాతావ‌ర‌ణానికి న‌ష్టం క‌లుగుతుంటే ఓ వ్య‌క్తి ఏం చేశాడ‌నేదే కథ. సామాజిక కోణంలో కథను ఎంచుకుని దానికి అధునాతన సాంకేతికతను జోడించిన తీరు బాగుంది.గ్రాఫిక్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.త్రీడీలోనే చూడాలనిపించే టెక్నికల్ విజువ‌ల్ వండ‌ర్‌గా సినిమా మెప్పిస్తుంది. సినిమాలో ఎక్కువగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించిన పదాలు వాడటంతో అవి సామాన్య ప్రేక్షకులకు అర్థం కావటం  కష్టమే. అయితే దర్శకుడు శంకర్ విజువల్స్ మరియు టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథనం మీద పెట్టలేదనిపిస్తుంది. క‌థ‌లో పెద్ద‌గా ట్విస్టులేం లేవు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి.ఇంటర్వెల్ ముందు… క్లైమాక్స్ లో చిట్టి, పక్షిరాజా ల ఫైట్స్ చాలా బాగున్నాయి.
 
నటీనటులు…
ర‌జ‌నీకాంత్ నాలుగు షేడ్స్‌.. వ‌శీక‌ర‌ణ్‌.. చిట్టి, వెర్ష‌న్ 2.0(బ్యాడ్ చిట్టి)..తో పాటు యూనిట్ దాచిన సీక్రెట్ ఏంటంటే వెర్ష‌న్ 3.0లోని మ‌రుగుజ్జు చిట్టి వెర్ష‌న్ 3.0 పాత్ర‌ల్లో ర‌జ‌నీకాంత్ చ‌క్క‌గా న‌టించాడు.ముఖ్యంగా 2.ఓ గా రీ లోడ్ అయ్యాక రజిని తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా అలరిస్తారు. అక్ష‌య్‌కుమార్ ఎన్‌త్రాల‌జీ ప్రొఫెస‌ర్‌గా.. చివ‌ర‌కు నెగ‌టివ్ ఎనర్జీ ఉన్న ప‌క్షిరాజుగా మెప్పించాడు. ఓ సాధారణ ప్రోఫెసర్‌ సమాజాన్ని పక్షి జాతిని కాపాడేందుకు పడే వేదనను ఆయన అద్భుతంగా పలికించారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో   అక్షయ్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణ.రోబో వెన్నెలగా అమీ జాక్సన్‌  తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 
 
సాంకేతికవర్గం…
ఏఅర్ రెహమాన్ అందించిన సంగీతం బాగుంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉన్న విజువల్స్ ను ఇంకా ఎలివేట్ చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది. నిరవ్ షా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించాడు ఇక ఆంటోని ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. ఇలాంటి విజువల్ వండర్ ని అందించినందుకు భారీ నిర్మాణ విలువులతో ఈచిత్రాన్ని నిర్మించిన సుభాస్కరన్ ను అభినందించాలి -రాజేష్