ఆ మాటే ఫాలో అవుతున్నా!.. అదే నా స్టైల్‌ !!

రజని స్టైలే ఒక మేజిక్‌… “నిజానికి స్టైల్‌గా ఉండాలని నేను నటించలేదు. అలా నటించను కూడా. కెరీర్‌ ప్రారంభంలో మూడు నాలుగు సినిమాల్లో నటించాక బాలచందర్‌ ఒకసారి – ‘నీ ప్లస్‌ పాయింట్‌ స్పీడ్‌, యాక్షన్‌. ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. నువ్వు దాన్ని కొనసాగించు’ అన్నారు. అదే నేను ఫాలో అవుతున్నాను. అదే నా స్టైల్‌”… అంటూ చెప్పారు దక్షిణాది ‘సూపర్ స్టార్’ రజనీకాంత్  ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో…
స్టార్‌డమ్‌…
ప్రతి మనిషికి కొన్ని కలలు ఉంటాయి. ఆ కల నిజమైనప్పుడు కలిగే సంతోషం మాటల్లో వర్ణించలేం. పేరు, డబ్బు, కీర్తి.. అన్నీ నిజమైనప్పుడు సంతోషంగా ఉంటుంది. అయితే ఇదొక మాయ మాత్రమే. అంతా కాలం చేతుల్లోనే ఉంటుంది. దిగ్గజాలు శివాజీ, ఎంజీఆర్‌ సమయంలో, మేము 1960ల్లో వచ్చుంటే మాకు ఇంత స్టార్‌డమ్‌ వచ్చేది కాదేమో. నా దర్శకులు, నిర్మాతల వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను.
కథల ఎంపిక…
ఫస్ట్‌ మాస్‌…! పిల్లలు, లేడీస్‌, ఫ్యాన్స్‌ అందరూ ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నాయా, లేదా అన్నది చూస్తాను. ఆ తరువాత రెండు, మూడు విషయాలు హృదయాన్ని తాకాలి. ఇంతకు ముందు నటించిన సినిమాలకు భిన్నంగా ఉండాలి. అలాంటి కథ ఉంటే ఒప్పుకుంటాను.
బెస్ట్‌ పెయిర్‌… 
నా ఫేవరెట్‌ పెయిర్‌ ‘ఫటాఫట్‌’ జయలక్ష్మి. ‘ముల్లుం మలరుమ్‌’, ఇతర సినిమాల్లో మా కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది. గ్లామరస్‌గా అయితే ఎంతమంది హీరోయిన్లతో అయినా నటించొచ్చు. కానీ, క్యారెక్టర్‌, అభినయం, క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయిన పాత్రల వరకు ‘ఫటాఫట్‌’ జయలక్ష్మి నాకు బెస్ట్‌ పెయిర్‌. నటి రాధికను కూడా చెప్పచ్చు.
అత్యుత్తమ కాంప్లిమెంట్‌…
అమితాబ్‌బచ్చన్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చారు. ‘బాషా’ చూశాక.. డైరెక్టుగా మా ఇంటికి వచ్చారు. నేను ఇంట్లో లేకపోయినా నా కోసం ఎదురుచూశారు. రాగానే కౌగిలించుకున్నారు. ‘ఇలాగే చేయాలి. మీరు అద్భుతంగా నటించార’ని మెచ్చుకున్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. స్క్రీన్ ప్లే  విషయంలో నాకు బాగా నచ్చిన సినిమా ‘బాషా’. ఆ తరువాత అంత గొప్పగా స్క్రీన్ ప్లే కుదిరింది ‘2.ఓ’ సినిమాకే. ఒక్కో సీను జరుగుతుంటే సంభ్రమంలో మునిగిపోతాం.
కమల్‌తో స్నేహం…
నేను ఇండస్ట్రీ కి వచ్చేటప్పటికే కమల్‌హాసన్‌ పెద్ద స్టార్‌. కాలేజి స్టూడెంట్స్‌లో సూపర్‌ క్రేజ్‌. తమిళనాడులోనే కాదు కర్ణాటక, ఆంధ్రా, కేరళలోనూ పెద్ద హీరో. నేను కూడా కమల్‌ నటనను సంభ్రమంగా చూసేవాడిని. సినిమాల్లోకి వచ్చాక ఒకసారి ఏదో షూటింగ్‌కి కమల్‌తో బండిపై వెళ్లాను. అప్పుడు నన్ను నేనే గిల్లుకుని ‘ఇది నిజమేనా’ అని ఆశ్చర్యపోయాను. తరువాత నాకూ స్టార్‌డమ్‌ వచ్చింది. అలాగని ఆయన్ని మించిపోయానంటే కరెక్టు కాదు. ఎప్పటికీ కమల్‌ కమలే. నేను నేనే. కమల్‌ తరువాతే నేను.

ప్రతిభకు అభినందనలు…

ఇప్పుడు వచ్చే ఏ సినిమా బాగున్నా, ఎవరైనా బాగా నటించినా వెంటనే మెచ్చుకోవడానికి కారణం…
కొత్తవారు ఒక సినిమా తీయడం కోసం ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. అది తెలిసి కూడా.. వారు  బాగా చేసినప్పుడు ఇతరుల్ని ప్రశంసించకపోతే ఇంకెందుకు? అలా చెయ్యడంలో ఆనందం ఉంటుంది. వారికీ ప్రోత్సాహంగా ఉంటుంది.
ఎమోషనల్‌ సందర్భాలు…
పిల్లల్ని అపహరించి అడుక్కునేందుకు ఉపయోగించడం చూస్తే చాలా బాధగా ఉంటుంది. కొంతమంది తల్లితండ్రులే తమ పిల్లలతో ఇలాంటి పనులు చేయడం మరింత దురదృష్టకరం. వాళ్లు మనుషులా, మృగాలా? అన్నది అర్థం కాదు. అటువంటి వారిని నడిరోడ్డులో కాల్చేయాలి.  అన్నంతగా కోపం వస్తుంది.
ఇంత సింపుల్‌గా ఎలా ?…
వెళ్లేది బీఎండబ్ల్యూ కారులో. ఉండేది చెన్నై పోయస్‌గార్డెన్‌లో. తినేది ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో. ఇంకా నేను సింప్లిసిటీ అనుకుంటే ఎలా! (నవ్వుతూ…)