చేతులెత్తేసాడు…. ‘సవ్యసాచి’ చిత్ర సమీక్ష

                                      సినీవినోదం రేటింగ్ : 2/5

మైత్రీ మూవీ మేక‌ర్స్‌ బ్యానర్ పై చ‌ందు మొండేటిదర్శకత్వం లో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్‌(సి.వి.ఎం) ఈ చిత్రం నిర్మించారు
 
కధలోకి వెళ్తే…
హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ టూర్లో బ‌స్సు ప్ర‌మాదానికి గుర‌వుతుంది. విక్ర‌మ్‌(నాగ‌చైత‌న్య‌) మిన‌హా అందరూ చ‌నిపోతారు. హాస్పిట‌ల్ నుండి విక్ర‌మ్ అక్క‌, బావ‌(భూమిక‌, భ‌ర‌త్ రెడ్డి) ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు. అక్క కూతురు మ‌హాలక్ష్మి అంటే విక్ర‌మ్‌కి చాలా ఇష్టం. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కార‌ణంగా విక్ర‌మ్ ఎడ‌మ చేయి అత‌ని ఆధీనంలో లేకుండా ప‌నిచేస్తుంటుంది. కోపం వ‌చ్చినా, ఆనందం వ‌చ్చినా ఎడ‌మ చేయి రియాక్ట్ అవుతుంటుంది. అది త‌న‌కు పెద్ద స‌మ‌స్య‌గా విక్ర‌మ్ భావిస్తుంటాడు. కాలేజ్‌లో చిత్ర‌(నిధి అగ‌ర్వాల్‌)ను ప్రేమిస్తాడు. అయితే త‌న కుటుంబం కార‌ణంగా ఆరేళ్ల పాటు చిత్ర‌కు దూర‌మ‌వుతాడు. యాడ్ డైరెక్ట‌ర్ అయిన విక్ర‌మ్ చిత్ర‌ను అనుకోకుండా తిరిగి క‌లుసుకుంటాడు. మ‌ళ్లీ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. అంతా బాగుంద‌నుకుంటున్న త‌రుణంలో విక్ర‌మ్ అక్క‌య్య ఇల్లు గ్యాస్ సిలిండ‌ర్ ప్ర‌మాదంలో పేలిపోతుంది. ఆ ప్ర‌మాదంలో విక్ర‌మ్ బావ చ‌నిపోతాడు. అక్క‌య్య తీవ్ర ప్ర‌మాదానికి గుర‌వుతుంది. పాప చ‌నిపోయింద‌ని రిపోర్ట్స్ వ‌స్తాయి. విక్ర‌మ్‌ అస‌లు ఇదంతా ఎందుకు జ‌రుగుతుంది? ప్రమాదంలో అక్క కూతురు మహాలక్ష్మి కూడా చనిపోలేదని, తన దగ్గరే ఉందని ఓ అజ్ఞాత వ్యక్తి(మాదవన్‌) విక్రమ్‌కి ఫోన్‌ చేసి చెప్తాడు. అసలు పాపను అతను ఎందుకు కిడ్నాప్ చేశాడు..? విక్రమ్‌కి అతనికి మధ్య వైరం ఏంటి..? బస్సు ప్రమాదానికి ఈ కథకు సంబంధం ఏంటి..? ఈ విష‌యాలు తెలియాలంటే సినిమాలో చూడాలి….
 
విశ్లేషణ…
దర్శకుడు చందు మొండేటి వానిషింగ్ ట్విన్ సిండ్రోమ సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు.ఫ‌స్టాప్ అంతా పాత్ర‌ల ప‌రిచ‌యం.. హీరో కాలేజ్ ల‌వ్ బ్యాక్ డ్రాప్‌తో రొటీన్ గా, బోరింగ్ గా సాగుతుంది. హీరో, విల‌న్ మ‌ధ్య మైండ్ గేమ్‌ ఆస‌క్తిక‌రంగా ఉండదు.ఇంటర్వెల్‌ తరువాత కథ వేగం అందుకుంటుదనుకున్న సమయంలో మరోసారి కాలేజ్‌ ఫ్లాప్‌ బ్యాక్‌ బ్రేక్‌ వేస్తుంది. ఈ సీన్‌లో సుభద్రా పరిణయం నాటకం, నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు పాటు ఆకట్టుకున్నా కథనం ఎమోషనల్‌గా సాగుతున్న సమయంలో ఈ సీన్స్‌ ఇబ్బంది పెడతాయి. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం, కథనం స్లోగా సాగడం, లవ్ స్టోరీ పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం, మాధవన్ అంత క్రూరమైన విలన్ గా మారడానికి గల బలమైన కారణాలను.. సరిగా చూపించక పోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.
 
నటీ నటులు…
నాగ చైతన్య ఒకరిలో ఇద్దరిలా చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. అలాగే తన మేనకోడలు మహాలక్ష్మితో ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చైతు నటన బాగుంది.హీరో హీరోయిన్ల మధ్య సీన్లు, వారి మధ్య కెమిస్ట్రీ బాగానే అలరిస్తుంది.కథానాయకిగా నటించిన నిధి అగర్వాల్ తన గ్లామర్ తో పాటు..తన నటనతోనూ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కాలేజీ సన్నివేశాల్లో , ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది.తెలుగు ప్రేక్షకులకు లవర్ బాయ్ గా పరిచయం ఉన్న మాధవన్.. పవర్ ఫుల్ విలన్ పాత్రలో తన గాంభీరమైన నటనతో మెప్పించారు. అయితే మాధవన్‌ని పూర్తిగా ఉపయోగించుకోలేదనే భావన కలిగిస్తుంది. మరో కీలక పాత్రలో నటించిన భూమిక కూడా ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది.ఇక వెన్నెల కిషోర్, సత్య తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో బాగా నవ్విస్తారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్, షకలక శంకర్ల కామెడీ బాగా పేలింది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
 
సాంకేతిక వర్గం…
సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతంలో టైటిల్ సాంగ్ మిన‌హా మ‌రేదీ బాలేదు. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది.సంభాష‌ణ‌లు అక్క‌డ‌క్క‌డా బావున్నాయి -రాజేష్