కత్రినాకైఫ్… “నేను ప్రభుదేవా అభిమానిని. ఆయన డాన్స్ అంటే ఎంత ఇష్టమో” అని తెగ పొగిడేస్తోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్. ఇండియాలోనే మోస్ట్ గ్లామరస్ హీరోయిన్గా పేరుగాంచిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అమీర్‌ఖాన్‌తో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంలో రీల్ ప్రేమాయణం సాగిస్తోంది. ఈ భారీ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే… ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంలో నటి కత్రినాకైఫ్‌కు ఒక ఐటమ్ సాంగ్ తరహాలో ఒక దుమ్మురేపే పాట చోటుచేసుకుంటుందట. ఈ పాటకు డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా నృత్యరీతులను సమకూర్చారు.
ప్రత్యేకమైన పాటల్లో కత్రినా కైఫ్ వేసే స్టెప్పులకు బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. పలు చిత్రాల్లో ఆమె చేసిన డాన్సులకు కుర్రకారు ఊగిపోయింది. తాజాగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో ఆమె మరోసారి తనదైన డాన్స్‌తో ఆకట్టుకుంటోంది. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రధారులుగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రం రూపొందుతుంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకుడు. ఇటీవల విడుదలైన సినిమాలోని పాత్రల లుక్స్, ట్రైలర్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా కత్రినా నటిస్తున్న నర్తకి సురైయా పాత్ర పేరుతో వచ్చే సాంగ్ టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఇందులో కత్రినా వేసే డాన్స్ హైలైట్‌గా నిలిచింది. ఆమె డాన్స్‌కు బ్రిటీషర్లు ‘వావ్’ అంటూ ఎంజాయ్ చేయడం, బ్రిటీష్ అధికారి గెటప్‌లో అమీర్ ఖాన్ సైతం కత్రినాతో కలిసి డాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది.
దీని గురించి కత్రినాకైఫ్ చెబుతూ… ప్రభుదేవా తన ఫేవరేట్ నృత్యదర్శకుడు అని పేర్కొంది.ఆయన డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది. ముఖ్యంగా ‘ముక్కాలా ముక్కాబలా’ పాట తన ఫేవరేట్ సాంగ్ అని పేర్కొంది. తాను ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంలో ఈ పాటలో నటించడానికి కారణం ప్రభుదేవా కొరియోగ్రఫినేనని అంది. ఆయన నృత్యదర్శకత్వాన్ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. ఇలాంటి వినూత్న కొరియోగ్రఫీని ప్రభుదేవా మాత్రమే చేయగలరని పేర్కొంది. తాను ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో నటించడం ఇదే ప్రప్రథమం అని చెప్పింది. అదేవిధంగా అమితాబ్‌తో కలిసి ఈ పాటలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో తాను నటించిన ‘సురైయ్యా’ అనే పాట హైలెట్‌గా ఉంటుందని చెప్పింది. ఇందులోని సురైయ్యా ‘ పాటలో అమితాబ్, కత్రినాకైఫ్‌ల మధ్య మంచి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుండగా, 1839లో వచ్చిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ ది థగ్’ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8న సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు టికెట్ రేట్స్ పెంచబోతున్నారు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లను పదిశాతం పెంచేందుకు చిత్ర నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోంది.