ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సక్సెస్ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఉత్తమ కుటుంబ కథా చిత్రాలను అందించడంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్‌రాజు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఇలాంటి నిర్మాణ సంస్థలో హీరోగా పరిచయం అవుతున్నారు గల్లా అశోక్. పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ తనయుడే గల్లా అశోక్.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై గల్లా అశోక్ హీరోగా విజయదశమి రోజున హైదరాబాద్‌లో ప్రారంభమైన చిత్రం`అదే నువ్వు అదే నేను`. నభా నటేశ్ హీరోయిన్గా నటిస్తుంది. శశి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రాంభోత్సవానికి సూపర్‌స్టార్ కృష్ణ, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, శ్రీమతి గల్లా అరుణకుమారి ముఖ్య అతిథులుగా విచ్చేసి యూనిట్ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగాదిల్రాజు మాట్లాడుతూ – “గల్లా అశోక్‌ను మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా పరిచయం చేయనుండటం ఆనందంగా ఉంది. `అదే నువ్వు అదే నేను` అనే టైటిల్‌తో అందరినీ ఆకట్టుకునే చిత్రాన్ని తెరకెక్కిస్తాం. శశి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో మిగతా నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం“ అన్నారు.