పాత కధతో రొటీన్ ఫ్యాక్షన్… ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్ర సమీక్ష

                                            సినీవినోదం రేటింగ్ : 2.5/5 

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ త్రివిక్ర‌మ్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం లో ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే…
వీర‌రాఘ‌వ‌రెడ్డి అలియాస్ వీర అలియాస్ రాఘ‌వ (ఎన్టీఆర్‌) కొమ్మ‌ద్దికి చెందిన నార‌ప‌రెడ్డి (నాగ‌బాబు) కుమారుడు. ప‌క్క ఊరు న‌ల్ల‌గుడిలో బ‌సిరెడ్డి (జ‌గ‌ప‌తిబాబు) ఉంటాడు. అత‌ని కుమారుడు బాల‌రెడ్డి (న‌వీన్ చంద్ర‌). ఒకానొక స‌మ‌యంలో బ‌సిరెడ్డి పేక ముక్క‌లు ఆడుతూ ఐదు రూపాయ‌లు బాకీ ప‌డ‌తాడు. అది అడిగిన వ్య‌క్తి త‌ల న‌రుకుతాడు. దాంతో రెండు ఊర్ల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ మొద‌ల‌వుతుంది. అమెరికాలో చ‌దువుకున్న రాఘ‌వ కొమ్మ‌ద్దికి వ‌చ్చీరాగానే అదే అదునుగా భావించిన బ‌సిరెడ్డి వారి మీద అటాక్ చేయిస్తాడు. ఆ అటాక్‌లో నార‌ప‌రెడ్డి ప్రాణాలు కోల్పోతాడు. అయితే, నార‌ప‌రెడ్డి త‌ల్లి చెప్పిన మాట‌లు విని రాఘ‌వ‌లో మార్పు వ‌స్తుంది. సిటీకెళ్తాడు. అక్క‌డ అత‌నికి నీలాంబ‌రి (సునీల్‌) ప‌రిచ‌య‌మ‌వుతాడు. అత‌ని గ్యారేజ్‌లో ఉన్న‌ప్పుడే అత‌నికి అర‌వింద (పూజా హెగ్డే) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమె ఆంత్రోపాల‌జీ స్టూడెంట్‌. ఫ్యాక్ష‌న్ గురించి స్పెషల్‌గా చ‌దువుతూ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పే మాట‌ల‌కు రాఘ‌వ క‌నెక్ట్ అవుతాడు. ఓ సంద‌ర్భంలో బాల‌రెడ్డిని పిలిచి మాట్లాడుతాడు. అందుకు రాజ‌కీయ ప్ర‌ముఖులు శుభ‌లేఖ సుధాక‌ర్‌, రావు ర‌మేశ్ కూడా మ‌ద్ద‌తు ప‌లుకుతారు. ఆ మీటింగ్ త‌ర్వాత ఏమైంది? బాల‌రెడ్డిని ఎవ‌రు చంపారు? త‌న ఊరు ప‌చ్చ‌గా ఉండాల‌ని రాఘ‌వ క‌న్న క‌ల నెర‌వేరిందా? లేదా? అనేది సినిమాలో చూడాలి… 
 
విశ్లేషణ…
“మ‌నుషుల మ‌ధ్య ప‌గ‌, ప్ర‌తీకారాల కంటే ప్రేమ ముఖ్యం’..అని చెబుతూ తొలిసారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో  చేసిన ఫ్యాక్షన్ చిత్రం ఇది. రొటీన్‌ కథ కావటంతో కొంత నిరాశ కలిగిస్తుంది.ప్రభాస్ నటించిన ‘మిర్చి’ , ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ గుర్తుకొస్తాయి.  తొలి ఇరవై నిమిషాల్లో సినిమాను యాక్షన్ సీక్వెన్స్ తో మంచి ఎమోషనల్ గా ఓపెన్ చేసిన దర్శకుడు.. దాన్ని కంటిన్యూ చేయలేక పోయాడు.. ముఖ్యంగా లవ్‌ స్టోరి సాగదీసినట్టుగా అనిపిస్తుంది.కొన్ని సన్నివేశాలను మరీ నెమ్మదిగా నడిపించారు. త్రివిక్రమ్ శైలి కామెడీ కూడా లేకపోవడం.. లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం సినిమాని బలహీనపరుస్తాయి.ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలుజోడించడానికి  చాలా స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామాని ఎలివేట్ చేయటానికే ఆసక్తి చూపాడు. ఫ‌స్టాఫ్ మిన‌హా సెకండాఫ్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండ‌దు. క్లైమాక్స్ బాగా తెరకెక్కించారు.ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.
 
నటీనటులు…
ఎన్టీఆర్ చాలా బాగా చేశాడు. ముఖ్యంగా రాయలసీమ యాసలో తారక్ చెప్పిన డైలాగ్స్, తన మాడ్యులేషన్ స్టైల్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తండ్రి చ‌నిపోయిన సీన్స్‌తో పాటు.. విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్టే సీన్స్ … ఫ‌స్ట్ ఫైట్‌లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌లో చేసిన ఫైట్ మెప్పిస్తాయి.హీరోయిన్ పూజా హెగ్డే అర‌వింద  పాత్ర‌లో బాగా న‌టించింది. హీరోని గొడ‌వ‌లు వైపు కాకుండా శాంతి వైపు వెళ్లేలా ఆలోచింప‌చేసే పాత్ర అది. మెయిన్ విల‌న్ బ‌సిరెడ్డిగా న‌టించిన జ‌గ‌ప‌తిబాబు లుక్‌, న‌ట‌న ఆక‌ట్టుకుంది. ప‌గ కోసం క‌న్న కొడుకునే చంపుకునే తండ్రి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి మెప్పించాడు.  ఇక న‌వీన్ చంద్ర పాత్ర కూడా ఆట్ట‌కునేలా ఉంది. ఇక క‌మెడియ‌న్‌గా న‌టించిన సునీల్ పాత్ర ప‌రిమిత‌మే అయినా.. ఉన్నంతలో మెప్పించాడు. ఈషా రెబ్బా పాత్ర కూడా పెద్ద‌గా చెప్పుకునేంత లేదు. పిసినారి లాయ‌ర్‌గా సీనియ‌ర్ న‌రేష్, అత‌ని అసిస్టెంట్‌గా శ్రీనివాస రెడ్డి కొంత న‌వ్వించారు. సితార‌, దేవ‌యాని, ఈశ్వ‌రీ రావు, రావు ర‌మేవ్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ త‌దిత‌రులు పాత్ర‌ల మేర  న‌టించారు.
 
సాంకేతికనిపుణులు…
ఆలోచింప చేసేలా డైలాగ్స్ రాశాడు త్రివిక్ర‌మ్‌. తమన్‌ సంగీతం సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. పాటలతో రిలీజ్‌కు ముందే ఆకట్టుకున్న తమన్‌.. నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్‌ని  పెంచేసాడు. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ లో తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంది.  ‘పెనివిటీ’ పాట తమన్ కెరీర్ లో చెప్పుకోతగ్గ పాటగా నిలిచిపోతుంది.  పాట‌లు విన‌డంలో ఉన్న అనుభూతి తెర‌పై చూస్తున్న‌ప్పుడు లేదు.రామ్ లక్ష్మణ్ స్టంట్స్ మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ని ఇస్తాయి. పీఎస్‌ విందా సినిమాటోగ్రపి సినిమాకు మరో ఎసెట్‌. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు విందా. నవీన్ నూలి ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాత కె రాధాకృష్ణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు -రాజేష్