“సినిమాలకన్నా నాకు సంగీతమంటేనే ఎక్కువ ఇష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. మా ఫాదర్‌కి కూడా నాలాగే సంగీతమంటే ఇష్టం. నా ఇష్టాన్ని గమనించే మా పేరెంట్స్ చిన్నతనంలోనే నాకు సంగీతం నేర్పించారు. నాకు సినిమాల్లో పాటలు పాడడం కన్నా ఓ మ్యూజిక్ ట్రూప్‌ని ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలు ఇవ్వడమే ఇష్టం”….అని అంటోంది ‘మంచి సింగర్ అయి ఉండి సినిమాల్లో పాడకపోవడానికి కారణం ఎంట’ని అడిగితే శ్రుతిహాసన్.
సినిమాల్లో పాడాలంటే నావరకూ కొద్దిగా కష్టమే. సాహిత్యం ఎవరో రాస్తారు. మరెవరో సంగీత దర్శకత్వం వహిస్తారు. కేవలం పాడడం తప్ప సింగర్కూ, ఆ పాటకూ ఎలాంటి సంబంధమూ ఉండదు. సినిమాల్లో సింగర్‌కి స్వేచ్ఛ తక్కువనేది నా అభిప్రాయం మాత్రమే. సొంత ట్రూప్‌లో అలాకాదు. బోలెడంత స్వేచ్ఛ ఉంటుంది. నా అభిరుచికి అనుగుణంగా ట్రూప్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. నాకు నచ్చినట్టు ఉండవచ్చు. వేరొకరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. ప్రారంభంలో కొన్ని సినిమాల్లో పాడినా నాకు సౌకర్యంగా అనిపించలేదు. అందుకే అక్కడ పాడడం మానుకున్నాను. మరీ మొహమాటం అయితేనే పాడుతున్నాను. నేను సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచీ చెబుతున్నాను. సంగీతమంటేనే నాకు ఇష్టం. ఎప్పటికైనా ఆ రంగంలోనే స్థిరపడతానని చెబుతూనే ఉన్నాను.
#నేను సినిమాలకు దూరం అవుతున్నానని ఎక్కడా, ఎవరితోనూ చెప్పలేదు. కొంత గ్యాప్ తీసుకున్న మాట వాస్తవం. ఇది నాకు నేనుగా కోరుకున్న గ్యాపే తప్ప.. సినిమా జయాపజయాలతో వీటికి సంబంధం లేదు. అయినా ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమా చేస్తున్నాను. ఈ మధ్యలో నాకిష్టమైన వ్యాపకాలతో కాలక్షేపం చేశాను.
#నాకు పెళ్ళి చేసుకోవాలని అనిపిస్తే దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని చేసుకున్నా మా పేరెంట్స్ మద్దతు ఇస్తారే తప్ప నాతో విబేధించరు. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాన్ని దాచి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. మైఖేల్‌తో నా పెళ్ళి జరగబోతోందన్న వార్తలు బాగా ప్రచారం చేశారు. తను నాకు మంచి స్నేహితుడు అంతే. ఓ ఫ్రెండుతో కలిసి సరదాగా బయట తిరిగితే రిలేషన్షిప్ అంటున్నారు. సాధారణంగా పార్టీలు రాత్రి సమయంలో జరుగుతాయి. అందుకే ఆ సమయంలో మైఖేల్‌తో వెళ్ళాను తప్ప.. మా మధ్య మరే బంధమూ లేదు.
#నా కెరీర్ ముందు నుంచీ రిస్క్‌లోనే ఉంది. కొత్తగా రిస్క్‌లో పడేదేముంది? ఒక టైంలో శ్రుతి సినిమాలకు పనికిరాదు అన్నారు. ఆ తరువాత వారే శ్రుతి స్టార్ హీరోయిన్ అన్నారు. ఎవరేమనుకున్నా నేను సినిమాలు చేయడం మానలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయాను. ఇప్పుడు గ్యాప్ కూడా నాకు నేనుగా తీసుకున్నదే తప్ప.. ఎవరో ఏదో అన్నారని మాత్రం కాదు.
#మాది సినిమా కుటుంబం. రూమర్లు అనేవి నాకు సర్వసాధారణంగా కనపడతాయే తప్ప.. వాటిని భూతద్దంలో చూసి భయపడను. అలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడే వాతావరణంలో నేను పెరగలేదు. నేనేమిటో మా పేరెంట్స్‌కి బాగా తెలుసు