సినీవినోదం రేటింగ్ : 2/5
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై మారుతి రచన, దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, పి.డి.వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు
కధలోకి వెళ్తే…
పెద్ద బిజినెస్ మేన్ రావ్(మురళీశర్మ)కు చాలా ఇగో ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఆయన ఇగో ఫీలవుతుంటారు. ఆయన ఇగో కారణంగా కూతురి పెళ్లి కూడా ఆగిపోతుంది. అయితే రావ్ కొడుకు చైతన్య(అక్కినేని నాగచైతన్య) మాత్రం తండ్రి భిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. తను అను (అను ఇమ్మాన్యుయేల్)ను ప్రేమిస్తాడు. ఆమె ఓ ఆర్టిస్ట్(పెయింటర్). అను మంచి అమ్మాయే అయినా ఆమెలో విపరీతమైన ఇగో ఉంటుంది. ఆ కారణంగా చైతుపై ప్రేమను చెప్పడానికి కూడా ఆలోచిస్తుంటుంది. చివరకు ఎలాగో చైతు ఆమెతో ఐ లవ్ యూ చెప్పించుకుంటాడు. వీరి ప్రేమ వ్యవహారం చైతు తండ్రికి తెలుస్తుంది. అయితే ఆమెలోని ఇగో చూసి ఆయన కూడా అనుని తన కోడలు చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో ఇగో హార్ట్ కావడంతో అక్కడే చైతు, అనుకి ఇష్టం లేకపోయినా నిశ్చితార్థం జరిపించేస్తాడు. కానీ అప్పుడే అను గురించి అసలు నిజం అందరికీ తెలుస్తుంది. వరంగల్‌కి చెందిన శైలజారెడ్డి(రమ్యకృష్ణ) కూతురే అను. ఆమె తల్లి అనుమతి లేకుండా ఆమెను పెళ్లి చేసుకోవడం కుదరదని… దాంతో ఇక ప్రేమ గెలిపించుకోవడం కోసం చైతు వరంగల్ చేరుకుంటాడు. శైలజారెడ్డిని చైతూ ఎలా తమ పెళ్లికి ఒప్పిస్తాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే….
విశ్లేషణ…
చిన్న డిజార్డర్ పెట్టి దాంతోనే వినోదం పండించే నేర్పు వున్న మారుతి ఈసారి ఫార్ములా సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. ఎప్పుడో కాలం చెల్లిపోయిన ‘పొగరుబోతు అత్త – అల్లరి అల్లుడు’ కాన్సెప్ట్ తీసుకుని తనదైన శైలిలో చేద్దామనే ప్రయత్నంలో దారుణంగా విఫలమయ్యాడు. ‘ఈగో’ అనే ఎలిమెంట్ చుట్టూ నడిపించి… ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమాని లాగించేయాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. హీరోయిన్, ఆమె తల్లి ఓ సందర్భంలో మాట్లాడుకోవడం మానేస్తారు. కానీ ఐదారేళ్లు మాట్లాడుకోనంత కారణం ఏమీ సినిమాలో కనపడదు. దాని వల్ల జనరేట్ అయ్యే కామెడీ పెద్ద వర్కవుట్ కాలేదు. మారుతి దర్శకుడిగా పాత్రల చిత్రీకరణను ఎలివేట్ చేయడంలో సెకండాఫ్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఎమోషన్స్‌తో ఉండాల్సిన సెకండాఫ్ సాదాసీదాగా సాగిపోతుంది.ఇటు హీరో-హీరోయిన్ సన్నివేశాలు కానీ అటు ‘అత్త-అల్లుడు’ కాన్‌ఫ్లిక్ట్ కానీ వర్కవుట్ కాలేదు. అత్త మనసు గెలుచుకోవడానికి అల్లుడు కి ఒక ఫైట్ సీన్ పెట్టి ముగించేసారు.
గత చిత్రాల్లో వెన్నెలకిషోర్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన మారుతీ ఈ చిత్రంలో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. ‘ఇగో’ కాన్సెప్ట్ తో మంచి కామెడీ చేసే అవకాశం వున్నా… ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు . సెకండ్ హాఫ్ లో బలమైన సన్నివేశాలు లేకపోవడంతో ఎమోషనల్ ట్రాక్ కూడా అంతగా కనెక్ట్ అవ్వదు.
నటీనటులు…
నాగ చైతన్య ప్రాత చైతు పాత్ర లో చైతన్య ఆకట్టుకున్నాడు . డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ లుక్ తో చాలా కొత్తగా కనిపించాడు. సినిమా అంత ఫుల్ యాక్టీవ్ గా కనిపించాడు. ఇక ఇగో వున్న అను పాత్రలో అను బాగా నటించింది.రమ్యకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండాఫ్ అంతా సినిమా ఆమె పైనే నడుస్తుంది. రమ్యకృష్ణ.. శైలజారెడ్డి పాత్రను సునాయసంగా పోషించారు. మురళి శర్మ పాత్ర కూడా సినిమాకు హైలైట్ గా నిలిచింది. నిజమైన ఇగోయిస్టు పర్సన్ ఎలావుంటాడో ఈ సినిమాలో ఆయనను చుస్తే అలాగే అనిపిస్తుంది.ఫస్టాప్ కంటే సెకండాఫ్‌లో పృథ్వీ, వెన్నెలకిషోర్ కామెడీ సన్నివేశాలు ఓకే.
సాంకేతిక నిపుణులు…
సంభాషణలు గొప్పగా లేవు. గోపీసుందర్ ‘అను బేబి’, ‘ఎగిరే’ సాంగ్స్ బావున్నాయి. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ బావుంది. నేపథ్య సంగీతం కొన్ని సీన్స్‌లో బాగుంది. అయితే యాక్షన్ సీన్స్‌లో ఆర్.ఆర్ బాగా లేదు – రాజేష్