కన్నీళ్లు వాటంతట అవే వచ్చేస్తాయి !

ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో గ్లిజరిన్ వాడే అవసరం ఎప్పుడూ రాలేదని చెప్పింది సమంత. తెరపై కన్నీళ్లు రావాలంటే గ్లిజరిన్ వాడాల్సిందే. కొందరు తారలు మాత్రం సీన్‌లో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయిపోయి సహజమైన ఉద్వేగాల్ని పండిస్తారు. గ్లిజరిన్ అవసరం లేకుండానే కన్నీళ్లు పెడతారు. తనది అదే తరహా అని చెబుతున్నది సమంత. ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో గ్లిజరిన్ వాడే అవసరం ఎప్పుడూ రాలేదని చెప్పింది. షూటింగ్ టైమ్‌లో అందరితో సరదాగా మాట్లాడుతూ జోకులు వేస్తూ ఉంటాను. దర్శకుడు ఒక్కసారి యాక్షన్ అని చెప్పగానే సన్నివేశంలోకి వెళ్లిపోతాను. సీన్ డిమాండ్‌ను బట్టి కన్నీళ్లు వాటంతట అవే వచ్చేస్తాయి అని చెప్పింది. కన్నడంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘యూటర్న్‌’ చిత్రం అదే పేరుతో సమంత కథానాయకిగా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కింది. కన్నడ చిత్ర దర్శకుడు పవన్‌కుమార్‌ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించడం విశేషం. చెన్నైలో జరిగిన ‘యూటర్న్‌’ చిత్రం తమిళ వెర్షన్ విలేకరుల సమావేశం లో సమంతా మాట్లాడుతూ…
 
ఇందులో నటించేటప్పుడు కొన్ని సన్నివేశాల్లో రెండుసార్లు కన్నీళ్లు పెట్టుకోవాల్సివచ్చిందని చమత్కరించింది సమంత.నాకు గ్లిజరిన్‌ వేసుకుని నటించడం నచ్చదని అన్నారు నటి సమంత. యూటర్న్‌ చిత్రంలో ఎమోషన్‌ సన్నివేశాలు చాలా ఉంటాయని చెప్పారు. అలా కష్టపడి ఒక సన్నివేశంలో నటించిన తరువాత మరో భాష కోసం అదే సన్నివేశంలో నటించాల్సి ఉంటుందని, అది చాలా ఛాలెంజ్‌ అనిపించిందని అన్నారు. హీరోల కష్టమేమిటో ఈ చిత్రంతో తాను అనుభవ పూర్వకంగా గ్రహించానని సమంత పేర్కొన్నారు.
అదే ఈచిత్రంలోకి తీసుకొచ్చింది
‘యూటర్న్‌’ లో హీరో, హీరోయిన్‌ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరన్నారు. కథే పెద్ద హీరో అని పేర్కొన్నారు. కన్నడ చిత్రం ‘లూసియా’ చూసినప్పుడే ఆ చిత్ర దర్శకుడు పవన్‌కుమార్‌కు తాను వీరాభిమానిని అయిపోయానన్నారు. అప్పుడే ఆయన దర్శకత్వంలో ఒక చిత్రం చేయాలని ఆశపడ్డానన్నారు. ఈ చిత్రం ద్వారా అది నెరవేరడం సంతోషంగా ఉందని అన్నారు.యూటర్న్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం మాత్రమే కాదని, ఇదో పెద్ద జర్నీ అని చెప్పారు. ఇందులో అన్ని రకాల భావోద్రేకాలు ఉంటాయన్నారు. అదే విధంగా చిత్ర షూటింగ్‌ను ఏకధాటిగా ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసినట్లు తెలిపారు. తనకు సహజత్వం తో కూడిన పాత్రల్లో నటించడం చాలా ఇష్టం అన్నారు. అదే తనని ఈచిత్రంలోకి తీసుకొచ్చిందని చెప్పారు.
 
వివాహనంతరం అగ్రనటిగా రాణిస్తున్న సమంత నాటి మేటి నటీమణులను గుర్తుకు తెస్తున్నారు. ఇటీవల సమంత తమిళ, తెలుగు భాషల్లో నటించిన చిత్రాలన్నీ సక్సెస్‌లే. అలాంటి నటి తాజాగా కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ స్టార్‌ హీరోలకు సపోర్టింగ్‌ పాత్రల్లోనే నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్న సమంత తాజాగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఓకె చెప్తున్నారు.