వరుస కష్టాల ‘టాక్సీవాలా’కు ‘లీకు’ సెంటిమెంటే ‘శ్రీరామ రక్ష’ !

‘టాక్సీ వాలా’… విడుదల ఎందుకు వాయిదా పడుతూ వస్తోంది? విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నిర్మించిన ‘టాక్సీ వాలా’ లో మాళవిక నాయర్ కథానాయిక. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా , వాయిదా వేస్తున్నారు. ‘టాక్సీవాలా’ సినిమాపై విజయ్ దేవరకొండకు భారీ ఆశలు ఉన్నాయి. తనకు మంచి హిట్ ఇస్తుందని నమ్మకంగా ఉన్నాడు. పైగా సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఇది “న్యూ ఏజ్ ఫిల్మ్” అని, ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. దాంతో మరింత ధైర్యంగా ఉన్నాడట.
 
‘టాక్సీ వాలా’ వాయిదా వేయడానికి కారణం ….ఔట్ పుట్ అల్లు అరవింద్ కు నచ్చకపోవడమేనట ! ‘టాక్సీ వాలా’ విడుదలకు సిద్దంగా ఉన్న పరిస్థితుల్లో అల్లు అరవింద్ కు ఒకసారి చూపించారట , సినిమా మొత్తం చూసిన అల్లు అరవింద్ కు చాలా సన్నివేశాలు నచ్చలేదట. దాంతో  మార్పు చేర్పులు చేయాలని చెప్పి,తగిన సలహాలు సూచనలు ఇచ్చారట అల్లు అరవింద్.’అర్జునరెడ్డి’ తో విజయ్ దేవరకొండ కు మంచి ఇమేజ్ ఏర్పడింది కనుక .. దాన్ని మరింతగా క్యాష్ చేసుకోవాలంటే తప్పకుండా ‘టాక్సీ వాలా’ కు రిపేర్లు చేయాలని డిసైడ్ అయ్యారట .దాంతో ‘టాక్సీ వాలా’ ని పక్కనపెట్టి ‘గీత గోవిందం’ ని ముందుగా విడుదల చేసారు. అది సూపర్ హిట్ అయ్యింది. ‘టాక్సీ వాలా’ ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం తెలియడం లేదు.
 
 ఆ పని ఏ దర్శకుడు చేస్తాడో …
‘టాక్సీవాలా’లోని కొన్ని సీన్స్‌ని రీషూట్ చెయ్యాలనుకున్నారట. ఈ బాధ్యతను గీతా ఆర్ట్స్‌తో క్లోజ్‌గా ఉండే మారుతికి అప్పగించాలనుకున్నారట. రాహుల్ సాంకృత్యాన్‌కు అంతగా అనుభవం లేకపోవడంతో మారుతికి సూపర్ విజన్ ఇవ్వాలనుకున్నారట. ‘శైలజారెడ్డి అల్లుడు’ త్వరలో విడుదలవుతోంది. ఆ పనులతో బిజీగా ఉన్నాడు. దీంతో తనకు ‘టాక్సీవాలా’పని కుదరదని చెప్తున్నాడట. మరి మారుతిపై ఆశలు పెట్టుకుంటే అతనేమో చెయ్యననేసరికి ..మరిప్పుడు ఈ రీషూట్ కోసం ‘టాక్సీవాలా’ మరో దర్శకుడి దగ్గరకు వెళ్తాడా? లేక రాహుల్ తోనే పని పూర్తి చేస్తాడా? అన్నది చూడాలి.
 
హెచ్‌డీ ప్రింట్‌ నెట్‌లో లీక్ అయ్యింది !
‘అరవింద సమేత వీర రాఘవ’ కేసు కొలిక్కిరాకముందే మరో సినిమా ‘ట్యాక్సీవాలా’ వంతు వచ్చింది. ఆ చిత్రానికి సంబంధించిన నిర్మాణ దృశ్యాలు లీక్‌ కాగా… ఈ సినిమా ఎడిటింగ్‌ సైతం కాకముందే హెచ్‌డీ ప్రింట్‌ నెట్‌కెక్కింది. నిర్మాణ సంస్థ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయ్‌ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ షూటింగ్‌ పూర్తి చేసుకుని ఎడిటింగ్‌కు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్‌డీ ప్రింట్‌తో పూర్తి సినిమాను యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అప్‌లోడ్‌ చేసి వైరల్‌ చేశారని నిర్మాణ సంస్థ గుర్తించింది. దీంతో వారి ప్రతినిధి సానం నాగ అశోక్‌కుమార్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. . ఇటీవల విడుదలైన ‘గీత గోవిందం’ సినిమా కూడా లీకైన విషయం తెలిసిందే. ‘అత్తారింటికి దారేది’ తో సహా ఇటీవల ‘లీక్’ అయిన సినిమాలన్నీ విజయవంతం కావడం విశేషం. ఆకోవలోనే  ‘టాక్సీవాలా’ కూడా హిట్ అవుతుందేమో. అందుకే ..వరుస కష్టాల ‘టాక్సీవాలా’కు ‘లీకు’ సెంటిమెంటే ‘శ్రీరామ రక్ష’ !.. అని పరిశ్రమలోనివారు  కామెంట్ చేస్తున్నారు.