తెలుగు చలన చిత్రసీమలో ఓ శకం ముగిసింది. ప్రముఖ నిర్మాత కె. రాఘవ (105) నిన్న రాత్రి కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సినిమా రంగానికి ‘కష్టేఫలి’ అనే మాట బాగా వర్తిస్తుందనడానికి రాఘవనే నిదర్శనం. బీదరికం కారణంగా చిన్న వయసులోనే ఇంట్లోంచి పారిపోయి కలకత్తాలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో ఆఫీస్ బోయ్ గా పనిచేశారు రాఘవ. ఆ తర్వాత ముంబైలో కొద్దికాలం ఫిల్మ్ ప్రోసెసింగ్ యూనిట్ లో వర్క్ చేశారు. విజయవాడ మారుతీ టాకీస్ లో కస్తూరి శివరావు దగ్గరా పనిచేశారు. చెన్నపట్నం చేరి కెమెరా ట్రాలీ బోయ్ గా, ఫైట్ మాస్టర్ గా, డూప్ గా… బతకడం కోసం రకరకాల పనులు చేస్తూ… చివరకు ప్రొడక్షన్ మేనేజర్ అయ్యారు.
ఆ తర్వాత మిత్రుల సహకారంతో ‘జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు, జగత్ జెట్టీలు’ సినిమాలు నిర్మించారు. ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ లో ‘తాతా మనవడు’తో దాసరిని, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో కోడి రామకృష్ణను దర్శకులుగా పరిచయం చేశారు. వీరిద్దరూ శతాధిక చిత్రాల దర్శకులు కావడం గొప్ప విశేషం. ‘సంసారం సాగరం’, ‘చదువు-సంస్కారం’, ‘తూర్పు-పడమర’, ‘అంతులేని వింత కథ’, ‘ఈ ప్రశ్నకు బదులేదీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను రాఘవ నిర్మించారు. ఆయన తెలుగుతో పాటు తమిళంలో ‘మైనర్ మా పిళ్ళై’, హిందీలో ‘ఇత్నీ సీ బాత్’ సినిమాలను కె. రాఘవ నిర్మించారు. సినిమా రంగానికి కొత్తవారిని పరిచయం చేయడంలో ముందుండే వారు.దాదాపు 30 చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన కె. రాఘవ కు 2009లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును అందించింది.