బయోపిక్ తో సంజయ్ దత్ కి ఎంత ముట్టింది ?

బాలీవుడ్‌లో అందరూ ఎదురుచూసిన సంజయ్‌ దత్‌ బయోపిక్‌ ‘సంజు’ సినిమా గత వారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్‌ కపూర్‌ నటనకు బాలీవుడ్‌ మొత్తం ఆశ్చర్యపోతోంది.బయోపిక్‌లు వాస్తవానికి దూరంగా తెరకెక్కుతున్నాయన్న విమర్శలు వస్తున్నా.. సినిమాలు మాత్రం విజయవంతమవుతున్నాయి. 
 
రాజ్‌కుమార్‌ హిరాణీ గత సినిమాల మాదిరిగానే ‘సంజు’ సినిమా రికార్డులను బ్రేక్‌ చేస్తోంది. విడుదలైన వారంలోనే దాదాపు 200కోట్లు కలెక్ట్‌ చేసి ప్రస్తుతం 250కోట్లకు పరుగెడుతోంది. అయితే ఈ సినిమాకు గాను సంజయ్‌దత్‌కు ఎంత ముట్టజెప్పారన్న వార్తలు వైరల్‌గా మారాయి. సంజయ్‌దత్‌కు మొదటగా ఓ పదికోట్లు ఇచ్చారని, సినిమా లాభాల్లో షేర్‌ కూడా ఉందనీ.. మొత్తంగా సంజయ్‌ దత్‌కు దాదాపు 20కోట్ల వరకు ముట్టవచ్చని బీటౌన్‌ టాక్‌. విదూ వినోద్‌ చోప్రా, రాజ్‌కుమార్‌ హిరాణీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనమ్‌కపూర్‌, మనీషా కొయిరాల, పరేష్‌ రావెల్‌, దియా మీర్జా, విక్కీ కౌశల్, అనుష్క శర్మ ముఖ్యపాత్రల్లో నటించారు.
ముఖ్యమైన విషయాలను విస్మరించారు 
సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’ లో సంజయ్‌ దత్‌ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలన్నింటినీ తెరపై చూపించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నా.. చాలా ముఖ్యమైన విషయాలను విస్మరించారని విమర్శకులు అంటున్నారు. సంజయ్‌ జీవితంలో కీలక పాత్రలు పోషించిన వారిని తెరపై అసలు చూపలేదని వారి వాదన. వారిలో సంజయ్‌ దత్‌ ఆప్త మిత్రుడైన సల్మాన్‌ ఖాన్‌, ప్రియురాలు మాధురీ దీక్షిత్ వంటి వారిని చూపలేదని, సంజయ్‌ కథానాయకునిగా తెరకెక్కిన ‘రాఖీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్‌ టీనా మునిమ్‌తో సంజుకు ఉన్న అఫైర్‌ గురించి ప్రస్తావన లేదని వారు అంటున్నారు.రిషీ కపూర్‌ రాసిన ‘ఖుల్లంఖుల్లా’ అనే పుస్తకంలో టీనా మునిమ్‌ ప్రస్తావన తెచ్చారాయన. సంజయ్‌ అతని మిత్రుడు గుల్సన్‌ గ్రోవర్‌.. టీనా మునిమ్‌తో తనకు అఫైర్‌ ఉందన్న అనుమానంతో తనను కొట్టడానికి ఇంటికి వచ్చారని, అయితే తనకు కాబోయే భార్య నీతూ సింగ్‌ వారికి నచ్చచెప్పటంతో గొడవ సద్దుమణిగిందని ఆ పుస్తకంలో రిషీ కపూర్‌ రాసుకున్నారు.