ఆ కూలీ గళంలో ఏదో తెలియని మ్యాజిక్‌ ఉంది!

 ప్రముఖ గాయకుడు  శంకర్‌ మహదేవన్‌ ‘‘ ప్రత్యేకమైన, టాలెంట్‌ ఉన్న ఒక రైతు రాకేశ్‌ ఉన్ని వీడియోను పోస్ట్‌ చేస్తున్నా. ఇంటర్నెట్‌ ద్వారా అతన్ని చేరుకున్నా. నేనతనితో మాట్లాడా…’’ అంటూ ఓ ట్వీట్‌ చేశాడు. అంతే… ఓవర్‌నైట్‌ సోషల్‌మీడియాలో రాకేశ్‌ స్టార్‌ సింగరయ్యాడు…

 
కేరళలోని అళప్పుళ జిల్లా నూరనడ్‌ గ్రామానికి చెందిన ముప్పై ఏళ్ల రాకేశ్‌ను అతడి మిత్రులు ‘ఉన్ని’ అని కూడా పిలుస్తారు. కలప దుంగలను లారీల్లోకి ఎక్కించడం, దించడం చేసే మామూలు కూలీ. రాకేశ్‌ పనిలో అలసటను మర్చిపోయేందుకు అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటాడు.శంకర్‌మహదేవన్‌ పాటలను అద్భుతంగా పాడతాడు. అలా ‘విశ్వరూపం’ సినిమాలో తనకు ఇష్టమైన పాట పాడాడు. ఆ పాటను శంకర్‌మహదేవన్‌ మెచ్చుకోవడం, అది సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావడంతో ఏకంగా కమల్‌హాసన్‌ అతడిని కలవాలని ఆహ్వానం పంపారు. కమల్‌ ముందు రాకేశ్‌కు తిరిగి ఆ పాట పాడే అవకాశం కలిగింది. పాట ఆసాంతం విన్న కమల్‌ అతడి టాలెంట్‌ను మెచ్చుకుంటూ ప్రశంసలజల్లు కురిపించారు. ‘‘ఒక విధంగా శంకర్‌మహదేవన్‌గారు నాకు గురువులాంటివారు. ఆయన లండన్‌ నుంచి నాకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నా టాలెంట్‌ను ఆయన మెచ్చుకున్నారు. దేవుని కృప ఉన్నవారికే ఇలాంటి గళం వస్తుందన్నారు. లండన్‌ నుంచి తిరిగి రాగానే నాతో కలిసి పనిచేస్తానంటూ ఆఫర్‌ కూడా ఇచ్చారు. ఆయన కోసం ‘అపరిచితుడు’ లోని ‘కుమారీ’ పాటపాడి నెట్‌లో పోస్ట్‌ చేశాను’’ అంటూ రాకేశ్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
‘సోషల్‌ మీడియా’ పుణ్యమా అని….
రాకేశ్‌ పాటను నెట్‌లో విన్న సంగీత దర్శకులు బాలభాస్కర్‌, శ్మామ్‌ సిఎస్‌, గోపీసుందర్‌, జిబ్రాన్‌లు కూడా అతడితో పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘‘ఎవరీ గాయకుడు? ఇతడిని పట్టుకోవడం ఎలా? నేనతడితో పనిచేయాలనుకుంటున్నా’’ అంటూ వారంతా ట్వీట్లు పెట్టారంటే రాకేశ్‌ ఎంతగా పాపులర్‌ అయ్యాడో తెలుస్తుంది. ‘‘గత వారం విశ్రాంతి తీసుకుంటుండగా నా మిత్రులంతా ఒక పాట పాడమని ఒత్తిడి చేశారు. దాంతో ‘విశ్వరూపం’లోని పాట పాడాను. షమీర్‌ అనే మిత్రుడు దాన్ని రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. దాన్ని పండాలమ్‌ బాలన్‌ అనే సంగీత కళాకారుడు షేర్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది’’ అంటున్నాడు రాకేశ్‌. విశేషమేమిటంటే… అతడు ఎవరి దగ్గరా సంగీత శిక్షణ తీసుకోలేదు. అయినా అతడి గళంలో ఏదో తెలియని మ్యాజిక్‌ ఉంటుంది. ఆ ఇంద్రజాలమే శంకర్‌మహదేవన్‌ కట్టిపడేసింది. కమల్‌హాసన్‌ను పరవశింపజేసింది. ‘సోషల్‌ మీడియా’ పుణ్యమా అని ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీలుగా మారుతున్నారు.