వాళ్ళ ముందు నేనో బచ్చాని !

టాలీవుడ్‌లో హీరోగా ‘పెళ్లి చూపులు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుని.. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో అగ్ర హీరోలతో పోటీపడేంత పాపులారిటీ సంపాదించి.. ‘మహానటి’ చిత్రంతో ఆ పాపులారిటీని మరింత పటిష్ఠం చేసుకున్నారు యువ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన నటించిన ‘టాక్సీవాలా’ రిలీజ్‌కు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తుండగా.. ‘నోటా’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది.
 
ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ‘ఫిల్మ్‌ఫేర్‌’కు నామినేట్ కావడంతో ఆనందాన్ని నెటిజన్లతో పంచుకుంటూ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు ….. జూన్ 16న హైదరాబాద్‌లో జరిగే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కార్యక్రమానికి తనతో పాటు మీలో ఒకర్ని ఆ ఫంక్షన్‌కి తీసుకువెళతానని, అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. http://www.rowdyclub.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఇక ‘అర్జున్ రెడ్డి’ ఆడియో ఫంక్షన్‌ నుండి తనను ఇష్టపడే వాళ్లను ‘రౌడీ ఫెలోస్’ అంటూ ఉన్నానని, ఇప్పుడు కూడా అదే పేరుతో ఈ వెబ్‌సైట్ రన్ అవుతుందన్నారు.
 
ఇక ఫిల్మ్ ఫేర్ నామినేషన్స్ గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి చిరంజీవి, వెంకటేష్, బాలయ్య చిత్రాలను చూసి పెరిగానని, ఆ తరవాత జనరేషన్‌లో వచ్చిన ప్రభాస్, ఎన్టీఆర్‌లు కూడా గొప్పనటులు ..అనిఅన్నారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లందరి ముందూ నేనో బచ్చాని. అలాంటిది వాళ్లందరితో పాటు నన్నూ ఉత్తమ నటుడు కేటగిరీలో ఫిల్మ్ ఫేర్‌కు నామినేట్ చేయడం గొప్ప అచీవ్‌మెంట్. నాకైతే ఫిల్మ్ ఫేర్ అవార్డు గెల్చుకున్నంత ఆనందంతో ఈ అవార్డ్ ఫంక్షన్‌కి వెళ్తున్నా.. మిమ్మల్ని కూడా నాతో తీసుకువెళ్తా అంటూ భలే ఆఫర్ ఇచ్చాడు విజయ్.