పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం `దేశ ముదుర్స్`. `ఇద్దరూ 420 గాళ్ళే` అనేది ఉప శీర్షిక కన్మణి దర్శకత్వంలో ఎం.కె.ఫిల్మ్ ప్రొడక్షన్స్ లో పులిగుండ్ల సతీష్ కుమార్, వద్దినేని మాల్యాద్రి నాయుడు సమర్పణలో కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అనంతరం..
పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ, ` రామానాయుడు గారు సినిమాను మాత్రమే నమ్ముతారు. కానీ మా నిర్మాత మనుషులని నమ్మి సినిమా చేస్తారు. అందుకే ఆయన ఇంకా పెద్ద నిర్మాత కాలేకపోయారు. మంచి, మనావత్వం ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు కాకపోయినా భవిష్యత్ లో కచ్చితంగా సక్సెస్ అవుతారు. రామానాయుడు గారులా మహీందర్ కూడా పెద్ద నిర్మాత అవుతారు. ఇక సినిమా విషయానికి వస్తే కన్మణి ప్రతీ సన్నివేశాన్ని చక్కగా తీశారు. చాలా క్లారిటీ ఉన్న, తెలివైన దర్శకుడు. ఆయనకు దక్కాల్సిన స్థానం ఇంకా దక్కలేదు. టాప్ దర్శకులలలో ఆయన స్థానం సంపాదిస్తారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది` అని అన్నారు.
పృథ్వీ మాట్లాడుతూ, ` కన్మణి అప్పట్లో నా ఊపిరి అనే సినిమా చేసారు. అది అద్బుతమైన చిత్రం. కానీ పెద్దగా ఆడలేదు. కానీ ఈ సినిమా తో ఆయనేంటో నిరూపించుకుంటారు. మంచి దర్శకులు. కథను ఆద్యంత ఆసక్తికరంగా నడిపించారు. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. సినిమా పెద్ద విజయం సాదించి నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలి. ఈ బ్యానర్లో మరిన్ని పెద్ద సినిమాలు రావాలి` అని అన్నారు.
దర్శకుడు కన్మణి మాట్లాడుతూ, ` ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. పోసాని కామెడీలో టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ను పట్టుకుని ఆయన పాత్రను…సన్నివేశాలను రాసుకున్నాను. ఆ టైమింగ్ మా సినిమాకు ప్లస్ అవుతుంది. పృథ్వీ గారిలో కూడా టైమింగ్ ఉంటుంది. ఇద్దరు పాత్రలు చూడటానికి ఒకేలా ఉన్నా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మా సినిమాకు నటీనటులు ఎంత బలంగా కుదిరారో, సాంకేతిక నిపుణులు అలాగే కుదిరారు. అందువల్లే సినిమా బాగా వచ్చింది. ఇక నిర్మాత సినిమా నిర్మాణానికి ఏ మాత్రం ఆలోచించలేదు. నేను అడిగిందల్లా క్షణాల్లో ఏర్పాటు చేసేవారు. సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. ఈనెల 22న రిలీజ్ చేస్తున్నాం. అంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాం` అని అన్నారు.
నిర్మాత కుమార్ మాట్లాడుతూ, ` మా కథను నమ్మి, పోసాని, పృథ్వీగారు సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా అంతా నవ్వుకునే విధంగా ఉంటుంది. కామెడీ జోనర్లలలో కొత్తగా ఉండే కథ ఇది. సినిమా బాగా వచ్చింది. ఈనెల 22న రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు అంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
సంగీత దర్శకుడు యాజమాన్య మాట్లాడుతూ, ` హారర్ కామెడీ సినిమా కు సంగీతం అందించడం ఇదే తొలిసారి. నా కెరీర్ లో మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నా` అని అన్నారు.
డైలాగ్ రైటర్ భవాని ప్రసాద్ మాట్లాడుతూ, ` సినిమాలో అన్ని పాత్రలు నవ్విస్తాయి. టైమింగ్ కామెడీకి టైమింగ్ డైలాగులు కుదిరాయి. సినిమా బాగా వచ్చింది. నిర్మాత ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈనెల 22న సినిమా రిలీజ్ అవుతుంది. అందరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.
అర్జున్, గాయత్రి, ఆలీ, బెనర్జీ, షకలక శంకర్, తాగోబోతు రమేష్, అనంత్, వెంకట్ తేజ్, హారిక, అశ్విని, రజిత, అపూర్వ, ప్రసాద్, ఫణి, దాసన్న తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: కె.వి.రమణ, మాటలు: భవానీ ప్రసాద్, నిర్మాత: కుమార్, కథ, కథనం, దర్శకత్వం: కన్మణి.